బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత తొలి టార్గెట్ కర్ణాటకేనని కేసీఆర్ ప్రకటించారు. ఎందుకంటే ఆ రాష్ట్రంలోనే మొదట ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.కానీ ఇప్పుడు కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ రేపో, మాపో రాబోతోంది.. కనీసం బీఆర్ఎస్ ప్రజెన్స్ కర్ణాటకలో కనిపించడం లేదు. కేసీఆర్ రాష్ట్రం బయట ఓ బహిరంగసభ పెట్టారు. అదీ మహారాష్ట్రలో పెట్టారు. అక్కడ జడ్పీ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. మరో బహిరంగసభ పెడుతున్నారు. కానీ కర్ణాటక జోలికి మాత్రం వెళ్లడం లేదు. ఎన్నికలు ముంచుకొస్తున్నా కనీసం కొంత మంది నేతల్ని చేర్చుకునే ప్రయత్నం చేయలేదు.
దేవేగౌడ పార్టీ జేడీఎస్ తో పొత్తులు కన్ఫర్మ్ అయ్యాయని.. ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ తెలంగాణగా ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో ముఖ్యంగా తెలుగువారున్న చోట్ల బీఆర్ఎస్ పోటీ చేస్తుందని మిగతా చోట్ల జేడీఎస్‌కు మద్దతు ఇస్తుందని చెప్పుకున్నారు. మొదట్లో బీఆర్ఎస్ కార్యక్రమాలకు పిలిచినప్పుడల్లా వచ్చిన కుమారస్వామి తర్వాత ముఖం చాటేస్తున్నారు. హైదరాబాద్ వైపు రావడం లేదు. బీఆర్ఎస్తో పని లేనట్లుగా రాజకీయం చేసుకుంటున్నారు. అభ్యర్థులను కూడా ప్రకటించుకుంటున్నారు.
కారణం ఏదైనా కుమారస్వామి మొత్తంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విషయంలో నమ్మకం కోల్పోయారని భావిస్తున్నారు. అందుకే ఆయన పట్టించుకోవడం అంటున్నారు. జేడీఎస్ సపోర్టుగా కర్ణాటకలో అడుగుపెడదామనుకున్న బీఆర్ఎస్ చీఫ్ కు పరిస్థితులు కలిసి రావడం లేదు. ప్రకాష్ రాజ్ కు బాధ్యతలిచ్చి… పార్టీని విస్తరిద్దామని చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. దీంతో బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారినా మరో రాష్ట్రంలో అదీ పొరుగు రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేయడం కష్టంగా మారింది.