చదువుకున్న వాళ్లు తమ పార్టీ ఓటర్లు కాదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకున్నారు. తమ పార్టీ ఓటర్లు వేరని ఆయన కవర్ చేసుకుంటున్నారు. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ గెలిచిన విషయాన్ని వీలైనంత తక్కువ చేసేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ పట్టభద్రుల ఎన్నికల వల్ల వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ ఉండదని.. ప్రభుత్వంపై కూడా ఎలాంటి ప్రభావం ఉండదన్నారు.
పట్టభద్రులు ఓ సెక్షన్ ఓటర్లు మాత్రమేనని చెప్పుకొచ్చారు. వారు వ్యతిరేకంగా ఉన్నారని అందరూ వ్యతిరేకంగాఉండరని ఆయన చెప్పుకొచ్చారు. కానీ పట్టభద్రుల్లో అన్ని వర్గాలకు చెందిన వారు ఉంటారనే సంగతి తెలిసి కూడా సజ్జల భయం బయటకు కనిపించనీయకుండా.. కవర్ చేద్దామని తాపత్రయ పడుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏదో మారిపోయిందని అనుకోవద్దని.. అన్ని ఓట్లూ టీడీపీవి కావని ఆయన చెప్పుకొచ్చారు. వామపక్ష పార్టీల ఓట్లు టీడీపీకి వెళ్లాయని తెలిపారు. టీడీపీ బలం పెరిగిందనడం కరెక్ట్ కాదని చెప్పుక౧చ్చారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు వైసీపీని ఆదరించారన్న విషయాన్ని గమనించాలని సజ్జల పేర్కొన్నారు. తొలిసారి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం తమకు పెద్ద విజయం అని చెప్పుకొచ్చారు.
ఇటీవల వస్తున్న సర్వేలకు తగ్గట్లుగానే ఫలితాలు ఉన్నాయని.. వైసీపీ పని నాలుగేళ్లకే అయిపోయిందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది. ఆ ఆందోళన కనిపించకుండా సజ్జల కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.