ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సౌత్ లాబీ మొత్తం ఈడీని ధిక్కరించాలనుకున్నారేమో కానీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా విచారణకు హాజరు కాలేదు. మామూలుగా అయితే ఆయన 18వ తేదీన ఉదయం పదకొండు గంటలకు హాజరు కావాల్సి ఉంది.కానీ హాజరు కాలేదు. హాజరు కాలేకపోతున్నానన్న సమాచారం కూడా ఈడీకి ఇవ్వలేదు. దీంతో మాగుంట వ్యూహం ఏమిటన్నది అంతుబట్టని విధంగా మారింది.
ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఇప్పటికే ఈ కేసులో అరెస్టయి నెల రోజులకుపైగా తీహార్ జైల్లో ఉన్నారు. ఆయనకు బెయిల్ కూడా రావడం లేదు. జ్యూడిషియల్ కస్టడీ పెరుగుతూ పోతోంది. అయితే ఇప్పుడు మాగుంట హాజరు కాకపోవడంతో తదుపరి ఈడీ ఏం చేయబోతోందనేది సంచలనంగా మారింది. సౌత్ లాబీ అంతా కలిసి ఈడీ విచారణను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై ప్రత్యేక కార్యాచరణ రెడీ చేసుకున్నారని.. ఆ ప్రకారమే డుమ్మాలు కొడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
సోమవారం కవిత ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. కానీ ఆమెకూడా హాజరయ్యే అవకాశాలు లేనని చెబుతున్నారు. కారణం ఏదైనా ఇలా తమను ధిక్కరిస్తున్న వారిపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది.