బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసులో ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎలాంటి ముందస్తు ఆర్డర్లు పాస్ చేయొద్దంటూ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి నిర్ణయాలు వెల్లడించరాదని కోర్టును కోరింది. ఈడీ కేసులో మార్చి 11న విచారణ ఎదుర్కొన్న కవితను.. మార్చి 16న మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది. అయితే ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ కవిత సుప్రీంలో పిటిషన్ వేసింది. కవిత దాఖలు చేసిన పిటిషన్పై తక్షణ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. మార్చి 24న విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
ఈ క్రమంలో కవిత పిటిషన్ పై ఈడీ కేవియట్ పిటిషన్ వేసింది. దీంతో ఇరు వర్గాల పిటిషన్లపై మార్చి 24 న సుప్రీంలో విచారణ జరగనుంది. ఈడీతో పాటు కవిత తరపు లాయర్ వాదనలు వినిపించనున్నారు. అయితే అంతకు ముందే సోమవారమే కవిత ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ కవిత సుప్రీంకోర్టులో విచారణ పూర్తయిన తర్వాతనే వస్తానని ఇంతకు ముందు లేఖ రాశారు. అందుకే విచారణకు వెళ్లరని తెలుస్తోంది. హైదరాబాద్లోనే ఉంటారని ఇప్పటికే స్పష్టత వచ్చింది.
తమ వాదనలు కూడా వినాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ … విచారణలో కోర్టు ముందు కీలక విషయాలు వెల్లడిస్తే కవితకు మైనస్ అవుతుంది. ఆమె ప్రమేయంపై స్పష్టమైన సాక్ష్యాలున్నాయని .. ఆమె నిందితురాలేనని ఆరోపిస్తే… ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆమె అనుమానితురాలని ప్రత్యేక కోర్టుకు ఈడీ తెలిపింది .