వైసీపీకి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక టెన్షన్ ప్రారంభమయింది. తెలుగుదేశం తమ ఎమ్మెల్యేలకు పార్టీ విప్ జారీ చేసింది. ఈనెల 23న జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధకు ఓటు వేయాలని తమకు ఉన్న మొత్తం 23 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు. నలుగురు ఎమ్మెల్యేలు ధిక్కరించడంతో వారు వైఎస్ఆర్సీపీకి ఓటు వేసే అవకాశం ఉంది. ఇలా పార్టీని కాదని ఇతర పార్టీకి ఓటు వేస్తే అనర్హతా వేటు పడుతుంది.
కానీ వైసీపీ పెద్ద సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయబోమని అంటున్నారు. విప్ జారీచేయాల్సిన అవసరం ఉందని అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఆనం, కోటంరెడ్డి ఆత్మప్రబోధానుసారం ఓట్లు వేస్తామంటున్నారు. విప్ లేకపోతే… ఇతర పార్టీకి ఓటు వేసినా గైర్హాజర్ అయినా చర్యలు తీసుకోలేరు. ఎమ్మెల్యేలు ధిక్కరించినా చర్యలు తీసుకోలేని పరిస్థితి వైసీపీకి ఏర్పడింది. అనర్హతా వేటు వస్తే ఉపఎన్నికలు వస్తాయని ఇప్పుడు ఆ రిస్క్ ఎందుకని ఆ పార్టీలో పెద్దలు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
0ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఏడు స్థానాలకు ఈ నెల 23న మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏడు స్థానాల కోసం ఎనిమిది మంది బరిలో ఉన్నారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారికి గెలుపు లభిస్తుంది. 22 ఓట్లు వస్తే విజయం లభిస్తుంది. ముగ్గురికి 21 ఓట్లు వచ్చినా సరిపోతాయి. తెలుగుదేశం పార్టీకి అధికారికంగా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే… వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల కన్నా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు ఉన్నట్లు లెక్క.
వైసీపీకి అధికారికంగా ఆరు స్థానాలు మాత్రమే గెలిచే బలం ఉంది. ఎవరైనా ఎమ్మెల్యేలు సరిగ్గా ఓటు వేయలేకపోయినా… ధిక్కరించినా… చెల్లని ఓటు వేసినా.. వైసీపీకి మొదటికే మోసం వస్తుంది. పరువు పోతుంది.