తిరుమలలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి నుంచి గంజాయి స్వాధీనం చేసుకోవడం అక్కడ పెద్ద ఎత్తున దందా జరుగుతోందని పోలీసులు గుర్తించడంతో శ్రీవారి భక్తులు నివ్వెర పోతున్నారు. ఎంతో పవిత్రంగా ఉండాల్సిన తిరుమల కొండపై ఇలా గంజాయి దందా కూడా జరుగుతోందంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిపోయిందోనని ఆందోళన చెందుతున్నారు. నిజానికి తిరుమలకు వెళ్లి వచ్చే ప్రతి భక్తుడు.. టీటీడీ నిర్వహణపై తీవ్ర విమర్శలు చేస్తూంటారు. కనీసం మంచి నీళ్లు కూడా దొరకని పరిస్థితికి తెచ్చారని మండిపడుతూ ఉంటారు.
ఇక ఎప్పుడూ సామాన్య భక్తులకు ప్రాధాన్యం అని ప్రకటిస్తూంటారు. కానీ రద్దీ లేకపోయినా కంపార్టుమెంట్లలో గంటల తరబడి వెయిట్ చేయిస్తూంటారు. కంపార్లుమెంట్లలో నీళ్లు కూడా ఇవ్వరు కానీ.. బయట వ్యక్తులు వచ్చి ప్రైవేటు వ్యాపారాలు.. తినుబండారాలు అమ్ముతూ ఉంటారు. అత్యంత దారుణంగా టీటీడీ నిర్వహణ ఉందని.. విజిలెన్స్ నిస్సహాయం అయిపోయిందని విమర్శలు వస్తున్న సమయంలో గంజాయి దందా గురించి బయటపడింది.
రాష్ట్రం మొత్తం గంజాయి దందా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే తిరుమలకూ వస్తుందని ఎవరూ అనుకోలేదు. ఇతర రాష్ట్రాల్లో కంటెయినర్లలో పట్టుబడుతున్న గంజాయి ఏపీ నుంచే రవాణా అవుతోంది. ఇతర రాష్ట్రాల్లో పట్టుబడుతోంది కానీ ఏపీలో మాత్రం పట్టుబడటం లేదు.దీంతో దేశంలో ఏపీ పరువు పోతోంది. ఇతర రాష్ట్రాల పోలీసులు వచ్చి ఇక్కడ సోదాలు చేస్తున్నారు. గంజాయి వ్యాపారంలో ఎవరో పెద్దలు ఉండబట్టే పైకి ప్రకటనలు..లోపల మాత్రం ఇంత పెద్ద దందా జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.