ఆంధ్రప్రదేశ్‌ను దక్షిణాఫ్రికా చేయాలని సీఎం జగన్ నిర్ణయించుకుని ఇప్పటికి పన్నెండు వందల రోజులు గడిచింది. కానీ ఆయన ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు. దీనికి కారమం రైతుల ఉద్యమం . తమకు ఉన్న సర్వస్వాన్ని అమరావతికి ధారబోసిన రైతులు దాన్ని జగన్ నిర్వీర్యం చేస్తూంటే తట్టుకోలేక రోడ్ల మీదకు వచ్చారు. అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. భూములు ఇచ్చి మరీ రోడ్డున పడ్డా.. మొక్కవోని పట్టుదలతో పోరాడుతున్నారు. కరోనాలు.. ప్రభుత్వ నిర్బంధాలు వారిని ఏమీ చేయలేకపోయాయి. ఓ వైపు ప్రజల్లో పోరాడారు.. మరో వైపు న్యాయపరంగా పోరాడుతున్నారు. న్యాయం వారిపై వైపు ఉంది . కానీ మూర్ఖుడైన రాజుతో వారు తలపడుతున్నారు. ఈ క్రమంలో వారు ఎన్ని కష్టాలు పడుతున్నారో చెప్పాల్సిన పని లేదు.
రాజధానిని నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వం చేయని తప్పు లేదు. కులం ముద్ర వేశారు. మతం ముద్ర వేశారు. ప్రాంతం ముద్ర వేశారు. రాజధాని 29 గ్రామాల సమస్య అన్నారు. ఇంకా ఏమేమో అంటున్నారు. ప్రజల పట్ల.. రాష్ట్ర ఉన్నతి పట్ల పాలకులు ఎక్కడైనా కనీస బాధ్యతతో ఉంటారు. ఏపీలో అవేమీ ఉండవు. ప్రజల్ని.. రాష్ట్రాన్ని పాతాళంలోకి తొక్కేసినా ఎలాంటి సమస్య లేదనుకుంటారు. చట్టం, రాజ్యాంగం, న్యాయవ్యవస్థ వంటివి అసలు లెక్కలోకి రావు. అలాంటి ఆలోచనలతో ఉన్న పాలకులతో రైతులు పోరాడుతున్నారు. తమపై ఎన్ని ముద్రలు వేసినా.. తమకు న్యాయం జరిగితే రాష్ట్రం బాగుపడుతుందని పోరాడుతున్నారు.
వారి పోరాటం ఫలిస్తోంది. ప్రజలు అమరావతికి మద్దతు పలుకుతున్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీఎన్నికల్లో వైసీపీ ఎంత ప్రచారం చేసినా టీడీపీకే ఓట్లేశారు. ప్రజలు కూడా రాజధాని ఉంటే అందరి బతుకులు బాగుపడతాయని.. పిల్లలకు మంచి భవిష్యత్ వస్తుందని నమ్ముతున్నారు. అందుకే వారందరి కళ్లకు రాజకీయాల కోసం అధికార పార్టీ కప్పిన కుల, మత, ప్రాంత మబ్బులను వీడిపోయేలా చేసుకుంటున్నారు. ఈ చైతన్యం ఇలా సాగితే త్వరలోనే అమరావతి రైతుల ఉద్యమం విజయవంతమవుతుంది. అప్పుడు అమరావతి మరింత ప్రకాశవంతమవుతుంది. ఎన్నో పోరాటాల ద్వారా ఏర్పడిన అమరావతికి ఇక తిరుగు ఉండదు.