తెలంగాణలో గెలిచి తీరాలనుకుంటున్న బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు మాత్రం రావడం లేదు.. ఇదిగో వస్తున్నాం.. అదిగో వస్తున్నాం అని షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. చివరికి అది వాయిదా పడుతుంది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన రద్దయింది. మార్చి 31న జేపీ నడ్డా సంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీసును ప్రారంభించాల్సి ఉంది. కానీ పర్యటన రద్దయింది. ఈ కార్యక్రమాన్ని జేపీ నడ్డా ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అక్కడి నుంచే కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించనున్నారు. భూపాలపల్లి, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాలను సైతం జేపీ నడ్డా వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
సంగారెడ్డిలో జరిగే కార్యక్రమానికి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, శివప్రకాశ్ జీ, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ పాల్గొననున్నారు.సాయంత్రం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో యధావిధిగా రాష్ట్ర పదాధికారుల, జిల్లా నేతల సమావేశం జరగనుంది. అయితే అగ్రనేతలు ఎందుకు వరుసగా తెలంగాణకు రాకుండా డుమ్మా కొడుతున్నారన్నది సస్పెన్స్‌గా మారింది. ప్రధానమంత్రి మోదీ పర్యటనలు ఇప్పటికి మూడు , నాలుగు సార్లు వాయిదా పడింది. మళ్లీ ఏప్రిల్ ఎనిమిదో తేదీ అంటున్నారు. కానీ క్లారిటీ లేదు. హోంమంత్రి అమిత్ షా .. ఇటీవల తెలంగాణకు వచ్చారు వెళ్లారు కానీ అసలు చప్పుడు చేయలేదు. ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని వెళ్లిపోయారు.
బీజేపీ నేతలు పోరాడుతున్నారని… గెలుపు ముంగిటకు వస్తున్నామని చెబుతున్నా…. బీజేపీ అగ్రనేతలు ఎందుకు తెలంగాణ కు రావడానికి జంకుతున్నారన్నది సస్పెన్స్ గా మారిపోయింది. పార్టీ అనుకున్నంతగా పుంజుకోకపోడంతో వారుకూడా ఈ సారి ఆశలు వదిలేసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. మామూలుగా అయితే గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంటే బీజేపీ కార్యాచరణ వేరుగా ఉంటుంది. కానీ అలాంటిదేమీ ప్రస్తుతం తెలంగాణలో కనిపించడంలేదు. ఇది బీజేపీ క్యాడర్‌ను కూడా ఆశ్చర్య పరుస్తోంది.