లోక్సత్తా జయప్రకాష్ నారాయణ ప్రభుత్వ ఉద్యోగుల్ని కించ పరుస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్ ఇంటర్యూలతో ఎక్కువ సమయం గడుతున్న జేపీ ఓ ఇంటర్యూలో ఉద్యోగుల గురించి మాట్లాడారు. అసలు ఉద్యోగులకు ఇస్తున్న జీతాలే చాలా ఎక్కువ అన్నారు. వారు చేస్తున్న పని బయట చేస్తున్న వారికి ఇరవై శాతమే వస్తుందని… కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎనభై శాతం ఎక్కువగా ఉంటుందన్నారు. అసలు వారికి పెన్షన్లు ఎందుకని ప్రశ్నించారు. ఏపీలో వైసీపీ ఉద్యోగుల్ని వేధించడం కరెక్ట్ అన్నట్లుగా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు ఉద్యోగుల మనోభావాలు కించ పరిచేలాఉండటంతో వారు భగ్గుమంటున్నారు .
ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వం.. వైసీపీ ఇస్తామన్నవాటి గురించే మాట్లాడుతున్నారు. చట్టబద్దంగా రావాల్సిన వాటి గురించే పోరాడుతున్నారు. చివరికి జీతాల కోసం రోడ్డెక్కాల్సి వస్తోంది. అయినా జేపీ ఇవేమీ పట్టించుకోకుండా వారిని టార్గెట్ చేయడం ఉద్దేశపూర్వకమేనని నమ్ముతున్నారు. దీనిపై ఏపీ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని భావిస్తున్నారు. ప్రస్తుత జాబ్ మార్కెట్ గురించి తమకన్నా జేపీకే ఎక్కువ తెలుసని… ప్రైవేటు రంగంలో వస్తున్న జీతాల కంటే ప్రభుత్వ రంగంలో తక్కువేనని అంటున్నారు. ఎంతో కష్టపడితే కానీ ప్రభుత్వ ఉద్యోగాలు రావంటున్నా రు.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు.. ప్రభుత్వ ఉద్యోగులా కాదా అన్నది చాలా మందికి డౌట్ గానే ఉంది. వారికి ప్రభుత్వ పరంగా ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. ఇతర ఉద్యోగులు… జీతాలు తగ్గించేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. అయితే నిరుద్యోగం చాలా ఉందని వారు చేసే పని ని ఇరవై శాతానికే పని చేసే యువత లభిస్తారని చెబుతూ ఉద్యోగుల్ని కించపర్చడం మాత్రం జేపీ వంటి వ్యక్తికి శోభనివ్వదంటున్నారు. అయితే జేపీ మాత్రం ఇటీవల ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చల్లోకి వస్తున్నారు.