దొంగలకే దొంగలనిపిస్తున్నారు ఏపీ పోలీసులు. వారి వ్యవహారాలు రోజూ హైలెట్ అవుతున్నాయి. రాజకీయ కారణాలతో వారు చేసే చేష్టలకు తోడుగా తాజాగా… దొంగతనాలు కూడా మొదలు పెట్టేశారు. అదీ కూడా సొంత స్టేషన్లలోనే. కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో 105 కిలోల వెండి దొంగతనం చేసింది పోలీసులేనని తేలింది.
తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన వ్యక్తి 2021లో సరిహద్దుల్లో ఎలాంటి బిల్లులు లేకుండా తీసుకెళ్తున్న వెండి, నగదును అధికారులు సీజ్ చేశారు. పంచలింగాల గేట్ దగ్గర సీజ్ చేశారు. 105 కిలోల వెండి, రూ. 2.5 లక్షల నగదు కదిరి పోలీస్ స్టేషన్లో ఉంచారు. వెండికి సంబంధించిన ఎవిడెన్స్ తీసుకుని ఆ వ్యక్తి కోర్టుని ఆశ్రయించాడు. దీంతో అతడికి వెండి, నగదు ఇచ్చేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులు తీసుకుని ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తనకు సంబంధించిన సీజ్ చేసిన వెండి, నగదు తనకు ఇచ్చేయాలన్నాడు.
కానీ స్టేషన్లో అవి లేవు. అయితే అవి మాయమయ్యాయి. దాదాపు నలుగురు సీఐలు ఆ స్టేషన్ నుంచి మారిపోయారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న సీఐ.. దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసు పై దృష్టి సారించిన జిల్లా ఎస్పీ ఆదేశించగా , ఉన్నతాధికారుల నేతృత్వంలో విచారణ చేశారు. వీరి విచారణలో ఇద్దరు పోలీసుల పాత్ర ఉన్నట్లు బహిర్గతమైంది. కర్నూల్ తాలుకు అర్బన్ పోలీస్ స్టేషన్లో గతంలో పనిచేసిన మహిళా హెడ్ కానిస్టేబుల్ అమరావతి, కానిస్టేబుల్ రమణ ఈ దొంగతనం చేసినట్లు తేలింది. వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు..
ఆ వ్యాపారి ధైర్యంగా ముందుకొచ్చారు కాబట్టి పోలీసుల దొంగతనం బయటపడింది. బయపడని పోలీసు దొంగలెంత మందో.!