వైసీపీ కోసం ఫుల్ టైమ్ వర్క్ చేస్తున్న ఆర్జీవీ వాళ్లను ఫూల్స్ చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడలేదు. వైసీపీలోని అత్యున్నత వర్గాలు చెప్పిన దాని ప్రకారం జూన్ మొదటి వారంలో అసెంబ్లీని రద్దు చేస్తారని డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు ఉంటాయని ఆర్జీవీ సోషల్ మీడియాలో ప్రకటించారు. దీంతో ఉత్కంఠగా గడుపుతున్న వైసీపీ నేతలంతా నిజమని నమ్మేసి ఆయనకు సమాధానం ఇవ్వడం ప్రారంభించారు. అయితే కాసేపటికే ఏప్రిల్ ఫూల్ అని పెట్టారు. దీంతో సామాన్య నెటిజన్లతో పాటు ఆయనను నమ్మిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా తిట్టడం ప్రారంభించారు.
రామ్ గోపాల్ వర్మ వైఎస్ఆర్సీపీ కోసం పని చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ కోసం రెండు సినిమాలు తీస్తున్నారు. మామూలుగా అయితే ఆ సినిమాల విడుదల తేదీన సాధారణ ఎన్నికలకు ముుందు ఉండేలా షెడ్యూల్ చేసుకుని చిత్రీకరణ జరుపుతున్నారు. అంటే వచ్చే ఏడాది జనవరి తర్వాత విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఎన్నికలకు ముందే వెళ్లాలని జగన్ నిర్ణయించుకోవడంతో.. ఆ రెండు సినిమాను ముందే సిద్ధం చేయాలని అంటే.. జూలై లేదా ఆగస్టుకల్లా సిద్దం చేసి విడుదల చేయాలని వైసీపీ నుంచి ఆయనకు సంకేతాలు వచ్చి ఉంటాయని అందుకే.. ఈ ప్రకటన చేసి ఉంటారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తర్వాత వైసీపీ పెద్దలు వార్నింగ్ ఇవ్వడంతో ఏప్రిల్ ఫూల్ అనిఉంటారని అంటున్నారు.
గత ఎన్నికలకు ముందు మహి వి రాఘవ్ అనే దర్శకుడు యాత్ర అనే సినిమాను తీశారు. ఇది వైఎస్ఆర్సీపీకి ప్లస్ అయిందన్న అభిప్రాయం ఉంది. అందుకే ఈ సారి ఆర్జీవీతోనే రెండు సినిమాలు వైసీపీ వ్యూహకర్తలు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆర్జీవీ చెప్పకపోయినా ఏపీకి ముందస్తు ఎన్నికలపై జగన్ కసరత్తు చేసుకుంటున్నారని వైసీపీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసలు వెళ్లడని.. తెలంగాణ ఎన్నికలతో పాటు వెళ్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.