ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం తెలుగు ప్రజలు లోతుగా ఆలోచించాల్సిన అంశాలను వారి ముందు పెట్టారు. నేరుగా ఆయన ఏమీ చెప్పలేదు దేశంలో ఇంత జరుగుతూంటే… తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు ఎందుకు నోరు మెదపలేకపోతున్నారన్న అంశాన్ని చాలా తెలివిగా తన ఆర్టికల్ ద్వారా ప్రజలకు వివరించారు. అందులో మొదటిది… ఏ మాత్రం సామర్థ్యం లేని నేతల్ని గెలిపించుకోవడం.. .. రెండు రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడిన సంఖ్యా బలహీనత.
జాతీయ రాజకీయాల్లో తెలుగువాడికి గతమెంతో ఘనకీర్తి ఉంది. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ దగ్గర్నుంచి కాంగ్రెస్ వ్యతిరేకంగా కొన్ని ఫ్రంట్లు అధికారం చేపట్టడంలో తెలుగువారి పాత్ర కీలకం. ఎన్టీఆర్, చంద్రబాబు చక్రం తిప్పేవారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. అయినా ఇప్పుడు చంద్రబాబు కూడా నోరు తెరవడం లేదు. ఎందుకు తెరవడం లేదనే విషయం అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే ఆయన రాజకీయ జీవితం సమాప్తమవుతుంది. ముందు ఆ రాజకీయ జీవితాన్ని పొడిగించుకోవడానికి గెలిచే ప్రయత్నాలు చేయాలి . గత ఎన్నికల్లో బీజేపీపై ఆయన తీవ్రంగా పోరాడారు. దాని ఫలితంగానే ఘోర ఓటమి. ఆయనకు కొంత బలం జనం ఇచ్చి ఉన్నా ఆ పోరాటం కొనసాగించి ఉండేవారేమో ?
ఇక ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు పొందిన జగన్, కేసీఆర్ పూర్తి స్థాయిలో కేసుల భయంతో సైలెంట్ అయ్యారు. జగన్ అసలు నోరెత్తే ప్రయత్నమే చేయడం లేదు. రివర్స్ లో రాహుల్ గాంధీనే విమర్శిస్తున్నారు. ఇక కేసీఆర్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి బయటకు రాకుండా ప్రగతి భవన్ నుంచే యుద్ధం చేస్తున్నారు. ఆర్కే ఈ విషయాలను గుర్తు కేసీఆర్ చేసే ప్రగతి భవన్ యుద్ధాన్ని కామెడీ చేశారు. కారణం ఏదైనా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే వారు కరువయ్యారు. కనీసం స్పందించలేనంత రాజకీయ పరిస్థితి ఏర్పడింది. పోరాడేవారిని ప్రజలు వద్దనుకోవడం.. అధికారం ఇచ్చిన వారు కేసుల భయంతో ఉండటం వల్లే ఇలాంటి సమస్య వచ్చిందని ఆర్కే తేల్చారు.
దేశ రాజకీయాల విషయంలో ఆర్కే చేసిన కామెంట్లు మోదీని వ్యతిరేకంగానే ఉంటున్నాయి. ఆయనలో అహం పెరిగిపోయిందని .. నేరుగానే చెప్పారు. ఆయన చేసే కామెంట్స్ బీజేపీ అగ్రనాయకత్వానికి తెలుస్తాయో లేదో కానీ… ఆయన మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గరు.