తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని పదే పదే కేంద్రానికి లేఖలు రాసే కేటీఆర్ ఈసారి ఏపీలో ని స్టీల్ ప్లాంట్ గురించి అందుకున్నారు. లక్షన్నర కోట్ల రూపాయల విలువ కలిగిన స్టీల్ ప్లాంట్ ను అప్పనంగా ప్రవేట్ పరం చేసే కుట్రలను కేంద్రం ఆపాలని … డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విడుదల చేసిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో చేసుకోబోయే ఒప్పందం విషయంలో ఎలాంటి నిర్దిష్ట నిబంధనలు లేవని.. ముడి సరుకులకు మూలధనం పేరిట స్టీల్ ప్లాంట్ ని తమ అనుకూల ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వైజాగ్ ఉక్కు తెలుగు వారి హక్కు… దీని కాపాడుకోవడం తెలుగువారి బాధ్యత అని సెంటిమెంట్ కూడా వినిపించారు.
భారత రాష్ట్ర సమితి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని…ప్రకటించారు. స్టీల్ ఉత్పత్తి రంగాన్ని నాన్ స్ట్రాటజిక్ రంగంలోకి మార్చడంలోనే కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగి ఉందని కేటీఆర్ అంటున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను పూర్తిగా ప్రైవేటుపరం చేసే ముందు, దాన్ని నష్టాల పాలు చేసి వాటిని సాకుగా చూపించి లక్షల కోట్ల విలువైన ఆస్తులను అప్పనంగా ప్రవేట్ కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పేందుకు కేంద్రం కుట్ర చేస్తుందన్నారు. నష్టాలను సాకుగా చూపించి తన కార్పొరేట్ కంపెనీల మిత్రులకు 12.5 లక్షల కోట్ల రూపాయలను రద్దు చేసిన ప్రధానమంత్రి మోడీకి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కనీసం కనికరం ఎందుకు ఉండడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి 7.3 ఎంటిపిఏ కెపాసిటీ ఉన్నా, కేవలం ముడి సరుకును, మూలధనాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల పూర్తిస్థాయి కెపాసిటీతో పనిచేయలేకపోతోందని తెలిపారు. ప్రస్తుతం పని చేస్తున్న 50 శాతం కెపాసిటికి కూడా 100 శాతం కెపాసిటి ఉత్పత్తికి అయ్యే ఖర్చే అవుతుందని మంత్రి చెబుతున్నారు. ఇప్పటికైనా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వర్కింగ్ కాపిటల్ పేరుతో ప్రైవేట్ కంపెనీలతో కలిపే ప్రయత్నాన్ని పూర్తిగా విరమించుకోవాలని సూచించారు. దీని బదులు కేంద్ర ప్రభుత్వమే అందుబాటులో ఉన్న ఇతర మార్గాల ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను బలోపేతం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం దాదాపు 25వేల కోట్ల వరకు మాత్రమే రుణాల మానిటైజేషన్ చేసుకోవడానికి కేంద్రం అవకాశం కల్పించిందని తెలిపారు. అయితే అదే స్థాయిలో ఆస్తులు లేదా విలువ కలిగిన ప్రైవేట్ కంపెనీలకు మాత్రం దాదాపు 70 నుంచి 80 వేల కోట్ల రూపాయల వరకు రుణాలను పొందగలిగే సౌకర్యాన్ని కేంద్రం కల్పించిందన్నారు. కేంద్ర ప్రభుత్వమే తక్షణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అవసరమైన మేరకు కనీసం ఐదువేల కోట్ల రూపాయలను కేటాయించాలని సూచించారు
భారత్ రాష్ట్ర సమితి ఒక పార్టీగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలన్న చిత్తశుద్ది తమకు ఉన్నదని . ఇందుకోసం కలిసి వచ్చే శక్తులు, ప్రజాసంఘాలు, పార్టీలతో కలసి ప్రజలను మరింత చైతన్యవంతం చేస్తామని ప్రకటించారు. ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు పెంచుకోవడానికి స్టీల్ ప్లాంట్ ఉద్యమం కన్నా మేలైనది మరొకటి లేదని బీఆర్ఎస్ వ్యూహకర్తలు ఓ అంచనాకు వచ్చి ఈ ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు.