సత్తెనపల్లిలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న అంబటి రాంబాబుకు సొంత పార్టీలో ఓ రెడ్డి గారు చాలెంజ్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి తీరుతానని చిట్టా విజయ్‌భాస్కర్‌రెడ్డి బహిరంగంగా ప్రకటించుకున్నారు. ఇందు కోసం సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ నేతలందరితో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. సత్తెనపల్లి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వీరంతా అంబటిని వ్యతికేరిస్తున్న వాళ్లే.
అంబటి రాంబాబు తీరు వల్ల పార్టీ ప్రతీ గ్రామంలో రెండుగా చీలిపోయిందని… నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడంలేదని, చిన్న పనిపై వెళ్లినా కోటరీలో నాయకులను కలిసి డబ్బులు సమర్పించుకోవాల్సి వస్తోందని సమావేశంలో పాల్గొన్న వారు ఫైర్ అయ్యారు. సత్తెనపల్లి అనాథ బిడ్డలా మారిందని అంటున్నారు. అంబటి రాంబాబు తన వల్లే గెలిచారని.. తాను నిర్మించిన పునాదులు బలహీనమవుతుంటే చూస్తూ ఊరుకోమని తానెంత వరకైనా పోరాడతానని చెప్పుకొచ్చారు. ప్రాణాలు అడ్డు పెట్టైనా సీటు సాధిస్తానని పార్టీ నాయకులు, కార్యకర్తలు తనకు అండగా నిలవాలని ఆయన కోరారు. సత్తెనపల్లి టికెట్ విషయంలో యుద్ధానికైనా సిద్ధమని తెలిపారు.
ఈ సమావేశానికి వెళ్లకుండా చాలా మంది వైసీపీ నేతల్ని అంబటి రాంబాబు కట్టడి చేశారు. కొంత వరకూ బెదిరింపులకూ దిగారు. అయితే ఈ సమావేశం… విజయ్ భాస్కర్ రెడ్డి చేసిన ప్రకటనలపై అంబటి రాంబాబు మామూలుగా స్పందించారు. అది పార్టీ అంతర్గత విషయమన్నారు. టిక్కెట్ ఎవరికి ఇస్తుందో హైకమాండ్ ఇష్టమన్నారు. మామూలుగా అయితే… అంబటికి టిక్కెట్ లేదన్నప్రచారం జరుగుతోంది. సొంతపార్టీలో వారు తిరుగుబాటు చేయడం లేదు. హైకమాండ్ చిట్టా విజయ్ భాస్కర్ రెడ్డిని ప్రోత్సహిస్తుందేమోనని… అంబటి వర్గీయులు అనుమానపడుతున్నారు.