స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చుట్టూ రాజకీయాలు చేయడంలో రాజకీయ పార్టీలు రాటుదేలిపోతున్నాయి. తాజాగా కేటీఆర్ కేంద్రానికి ఓ లేఖ రాసి .. ఏపీ కోసం తామే కొట్లాడుతామన్నట్లుగా సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. దీనిపై సీబీఐ మాజీ జేడీ వినూత్నంగా స్పందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆయన తీసుకున్న ఈ చర్యను తాను స్వాగతిస్తోన్నానని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం గనక వెనక్కి తగ్గకుంటే.. తెలంగాణ ప్రభుత్వం ముడి సరుకు సరఫరా, వర్కింగ్ క్యాపిటల్‌ను అందించే బిడ్‌లో పాల్గొనాలని జేడీ లక్ష్మీనారాయణ సూచించారు. ఇది తెలంగాణ సర్కార్ కు మింగుడు పడని సలహానే.
ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే కాదు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే వైఖరిని అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం కూడా ఇదే బిడ్ లో పాల్గొనాలని వైఎస్ జగన్‌ను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముడి పదార్థాల సరఫరా, ప్లాంట్ నిర్వహణకు అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన జారీ చేశారు. ఇది ప్రైవేటీకరణలో ఓ భాగమని కేటీఆర్ ఆరోపిస్తూ లేఖ రాశారు. అందుకే జేడీ తెలివిగా ప్రైవేట్ కంపెనీల ప్రవేశాన్ని నిరోధించడానికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ, తెలంగాణ లేదా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ బిడ్డింగ్ లో పాల్గొనాల్సి ఉంటుందని సలహాలిస్తున్నారు.
రాజకీయం చేయడానికే కానీ ఇలాంటి విషయాల్లో ఏపీ అధికార పార్టీలు చొరవ చూపవు. చూపితే ఏం జరుగుతుదో వారికి తెలుసు. అందుకే జేడీ వ్యూహాత్మకంగా వారిని ఇరికించారని అనుకోవచ్చు. ఇకపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏదైనా ఉద్యమంచేస్తే.. రెండు ప్రభుత్వాలకూ … మీరే ఎందుకు కొనకూడదు అనే ప్రశ్న ఇతర వైపుల నుంచి వచ్చే అవకాశం ఉంది.