ముందస్తు ఎన్నికలు రావన్న ఒకే ఒక్క నమ్మకంతో పవన్ కల్యాణ్ నింపాది రాజకీయాలు చేస్తున్నారు. ఆయన తన సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నారు. మిగతా వ్యవహారాలన్నీ నాదెండ్ల మనోహర్ చూసుకుంటున్నారు. పార్టీ తరపున చేస్తామని చెబుతున్న యాత్రలన్నీ పెండింగ్లో ఉన్నాయి. నారసింహ యాత్ర అన్నారు. వారాహి యాత్ర అన్నారు… అవేమీ ముందుకు సాగడం లేదు. జనవరి నుంచే ఉంటుందనుకున్నారు కానీ ఏప్రిల్ వచ్చినా చప్పుడు లేదు. కానీ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా సినిమాలు ప్రారంభిస్తూనే ఉన్నారు.
గత ఏడాది కాస్త యాక్టివ్ గా పవన్ కార్యక్రమాలు చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు సంబందించి నష్టపరిహరం పంపిణి చేశారు. ఒక్కొ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. వాటికి మంచి స్పందన వచ్చింది. కానీ ఆ టెంపోను కొనసాగించలేకపోయారు. కొన్ని జిల్లాల్లో ఇంకా పరిహారం సాయం చేయాల్సి ఉంది. మరో వైపు ముందస్తు ఎన్నికల కోసం జగన్ పూర్తిగా రెడీ అవుతున్నారని రాజకీయ పార్టీలు నమ్ముతున్నాయి . డిసెంబర్లో ఎన్నికలంటే ఇక తొమ్మిది నెలల సమయం మాత్రమే ఉంది. ఓ రాజకీయ పార్టీకి మొదటి నుంచి ఎన్నికల ప్రయత్నాలు ప్రారంభించడం ఈ సమయం సరిపోదు.
పవన్ కల్యాణ్ ఇప్పటికీ పార్టీ నిర్మాణాన్ని చేపట్టలేకపోయారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్లు చేయడానికి చాలా మంది ఉంటారు. కానీ గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను పట్టించుకునేవారు ఉండరు. పవన్ పర్యటించినప్పుడు జనం వస్తారు తప్ప.. మరే ఇతర కార్యక్రమంలోనూ జనసైనికులు కనిపించరు. ద్వితీయ శ్రేణి నాయకత్వం చాలా బలహీనంగా ఉంది. ఇలాంటి వాటన్నింటినీ సార్ట్ అవుట్ చేసుకోవడానికి సమయం సరిపోదు. పైగా ఇప్పుడు పవన్ కల్యాణ్ ఫ్రీ అయ్యే అవకాశం లేదు. ముందస్తు ఎన్నికలు వచ్చినా ఆయన సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ మాత్రం ఏడాది చివరి వరకూ బిజీగా ఉంటాయి.
ఓ వైపు అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. వైసీపీ, టీడీపీ ఊరూరా కార్యక్రమాలు చేపడుతున్నాయి. కానీ జనసేన మాత్రం లేట్ అవుతోంది. పవన్ కు ప్లాన్ బీ ఏమైనా ఉందే లేదో తెలియదు కానీ ఇప్పటికైతే సన్నాహాల్లో కూడా ఆ పార్టీ వెనుకబడి ఉన్నట్లుగానే చెబుతున్నారు.