రాజకీయాల్లో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాటలు ఇటీవల తరచూ హైలెట్ అవుతున్నాయి. మూడు రాజధానులకు మద్దతుగా ఓటేయకపోతే చచ్చిన శవంతో సమానం అన్నట్లుగా వ్యాఖ్యలు ప్రారంభించి … ఇప్పుడు వైసీపీకి ఓటేయకపోతే బుల్లెట్ దిగుతుందని ఆడవాళ్లను బెదిరించే స్థాయికి దిగజారిపోయారు. ఆయన మాటలు విని వైసీపీ నేతలు కూడా … ధర్మాన ఎందుకు ఇంత కంగారు పడుతున్నారన్న చర్చలు నడుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి మంత్రిగా ఉన్న ఆయన తమ ప్రజల్ని కించ పర్చడానికి బెదిరించడానికి కూడా వెనుకాడటం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖ రాజధాని కాకపోతే ఉత్తరాంధ్ర రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ ఆయన మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు.
పరిస్థితి తేడాగా మారిపోతోందని గుర్తించిన తర్వాత ఆయన మరింత చెలరేగిపోతున్నారు. మహిళలు కూడా ప్రభుత్వానికి ఓట్లేయరని ఆయన నమ్మకం ఏర్పడిపోయింది. అందుకే బెదిరింపులకు దిగుతున్నారు. ఆసరా పథకానికి జగన్ మీట నొక్కారు. కానీ డబ్బులు పడలేదు. అయినా సంబరాలు చేస్తున్నారు. ఈ సంబరాల్లో ధర్మాన పాల్గొని ఆడవాళ్లను బెదిరిస్తున్నారు. ఈ ప్రభుత్వం పోతే వచ్చే డబ్బులు రావని అంటున్నారు. వైసీపీకి ఓటు వేయకపోతే అకౌంట్లలో డబ్బులు పడవని హెచ్చరిస్తున్నారు. ఇందు కోసం మగవాళ్లను తిడుతున్నారు.
అకౌంట్లలో వేసే పదో పరకో గురించే కాదు… వైసీపీ ప్రభుత్వం పెంచిన పన్నుల గురించి పిండుకుంటున్న ఆదాయం గురించి కూడా మహిళలకు అవగాహన ఉంది. రూ. పది ఇచ్చి వంద వసూలు చేస్తున్నారని ఇప్పటికే ఓ స్పష్టత ఉంది. అందుకే మహిళలు ఎవరూ పట్టించుకోవడం లేదు. వైసీపీ సభల నుంచి పారిపోతున్నారు. బలవంతంగా తీసుకు వచ్చి.. బెదిరించి కూర్చోబెట్టినా ప్రయోజనం ఉండదు. వైసీపీ నేతల అవస్థలు చూసి … సామాన్య ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు.