సీఎం జగన్ ఎమ్మెల్యేలపై ఫైర్ కాలేదు. టిక్కెట్ ఇవ్వబోనని ప్రకటనలు చేయలేదు. గట్టిగా హెచ్చరికలు కూడా చేయలేదు. గడప గడపకూ మన ప్రభుత్వం సమీక్షలో ఆయన తీరు మారిపోయిది. పైగా ఆరవై మందికి టిక్కెట్లు ఇవ్వడం లేదని ప్రచారం చేస్తున్నారని… రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ ప్రచారాాలు జరుగుతాయని గట్టిగా తిప్పికొట్టాలని ఎమ్మెల్యేలకే సలహా ఇచ్చారు. అసలు ప్రతీసారి ఇలాంటి సమావేశం జరిగిన తర్వాత లీకులిచ్చేది వైసీపీ నేతలే.. అయితే ఇవి రూమర్స్ అని తిప్పి కొట్టాలనేది చెప్పేది కూడా వైసీపీ అధినేత.
గడప గడపకూ మన ప్రభుత్వం సమీక్షలో సీఎం జగన్ ఎమ్మెల్యేలను కాస్త బతిమాలుతున్నట్లుగా చెప్పుకొచ్చారు.. మనపై కోట్ల మంది ఆధారపడి ఉన్నారని.. వారికి మేలు చేయాలంటే.. మన గ్రాఫ్ తగ్గకుండా చూసుకోవాలన్నారు. సీరియస్గా గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనాలని. ఆగస్టు కల్లా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరారు. ముందస్తు ఎన్నికల గురించి కూడా చెబుతున్నారని కానీ ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయం ఉందని చెప్పుకొచ్చారు. నిజానికి 2019లో ఏప్రిల్ 11న ఏపీలో పోలింగ్ జరిగింది. అంటే కరెక్ట్ గా పన్నెండు నెలలు కూడా లేవు. కానీ సీఎం జగన్ మాత్రం ఎన్నికలకు ఇంకా 14 నెలల గడువు ఉందని పొడిగించుకున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల విషయంలో సీఎం జగన్ పెద్దగా నష్టం జరగలేదని చెప్పడానికి ప్రయత్నించారు. అసలు టీడీపీ గెలిచింది నాలుగు మాత్రమేనని మొత్తం 21 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయన్నారు. వైసీపీ 17 స్థానాల్లో గెలిచిందన్నారు. నిజానికి టీడీపీ పోటీ చేసింది.. ప్రజలు ఓట్లేసిన ఎమ్మెల్సీ స్థానాలు అవే. కానీ తన ఓటమిని అంగీకరించలేక జగన్ ఇలా స్థానిక సంస్థలు.. ఎమ్మెల్యేల కోటాల్లో గెలిచామని అనుకుంటున్నారని చెబుతున్నారు. వాపును చూపి టీడీపీ బలుపు అనుకుంటున్నారని… ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని జగన్ చెప్పుకొచ్చారు. జగన్ తీరు వైసీపీ ఎమ్మెల్యేలను కాస్త ఆశ్చర్యపరిచింది. ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వాలన్న విషయం చేతులు కాలిన తర్వాత తెలిసిందన్న సెటైర్లు వినిపించాయి.
జగన్తో సమావేశానికి పది మందికిపైగా ఎమ్మెల్యేలు గైర్హాజర్ అయ్యారు. ఇప్పటిేక నలుగురు పార్టీకి దూరం కాగా మిగిలిన వారిలో పది మందికిపైగా సమాచారం లేకుండా డుమ్మా కొట్టడం వైఎస్ఆర్సీపీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనకు కరోనా పాజిటివ్ వచ్చినందున హాజరు కావడం లేదని సమాచారం పంపారు. మిగతా ఎవరూ ముందస్తు సమాచారం ఇవ్వలేదని వైఎస్ఆర్సీపీ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారు ఉన్నారు.