వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేందర్ రెడ్డి అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 25వ తేదీ వరకూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని జస్టిస్ సురేందర్ రెడ్డి ఆదేశించారు. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కావాలని.. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. అవినాష్ రెడ్డిని అడిగే ప్రశ్నలన్నీ లిఖితపూర్వకంగా ఉండాలన్నారు. బెయిల్ పిటిషన్పై తుది తీర్పును ఈ నెల 25న ఇస్తామని న్యాయమూర్తి తెలిపారు.
అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వవొద్దని సీబీఐ తరపు న్యాయవాదులు గట్టిగా వాదించారు. అవినాష్ రెడ్డినే అసలు సూత్రధారి అని స్పష్టం చేసింది. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని సీబీఐ లాయర్లు వాదించారు. వివేకానంద రెడ్డి హత్య 2019 మార్చి 14, అర్ధరాత్రి జరిగిందని.. మార్చి 17న వైసీపి తరఫున కడప ఎంపీ టికెట్ అవినాష్ కు కన్ఫాం అయిందని సీబీఐ తెలిపింది. మార్చి 21న అవినాష్ రెడ్డి నామినేషన్ వేశారని.. కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అవినాష్ రెడ్డి చెబుతున్న
బెంగళూరు ఆర్ధిక లావాదేవీలు, వివాదాలు, నిందితులు ఆరోపిస్తున్న వైఎస్ వివేకానంద రెడ్డి అక్రమ సంబంధాలపై కూడా లోతైన విచారణ జరిపామని… వివేకా హత్యకు ఇవేవీ కారణాలు కావని సీబీఐ తెలిపింది.
అయితే అవినాష్ రెడ్డి తరపు లాయర్ని అసలు హత్యకు కారణాలేమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు. నాలుగు కారణాలతో హత్య జరిగిందని వాదించారు. వివేకా రెండో భార్యతో సునీతకు వివాదం.. వ్యాపార లావాదేవీల్లో గంగిరెడ్డితో విభేదాలు.. అనేక రాజకీయ కారణాలు ఉన్నాయని అవినాష్ తరఫు లాయర్ న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. హత్యకు వాడిన ఆయధం దొరికిందా.. గుండెపోటు అని ఎందుకు ప్రచారం చేశారు లాంటి ప్రశ్నలు అడిగిన న్యాయమూర్తి.. తర్వాత 25వ తేదీ వరకూ అరెస్ట్ చేయవద్దని ఉత్తర్వులు జారీ చేశారు. 25వ తేదీన తుది ఉత్తర్వులు ఇస్తామన్నారు.
అత్యంత తీవ్రమైన కేసుల్లో.. అనేక మందిని సీబీఐ అరెస్టు చేసినప్పటికీ.., అవినాష్ రెడ్డిని మాత్రం అరెస్ట్ చేయలేకపోతున్నారు. ప్రతీ సారి సీబీఐ నోటీసులు ఇచ్చినప్పుడల్లా హైకోర్టుకు వెళ్లి విచారణను అడ్డుకుంటున్నారు. హైకోర్టు కూడా ఈ పిటిషన్లను సీరియస్గా విచారిస్తోంది. ఊరట కల్పిస్తోంది.