వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు ఏం కాదని కొన్నాళ్లు జైల్లో పెడతారని.. కానీ వారిపై కేసులు నిలబడవని తీర్పు ఇచ్చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. మరింక ఎందుకు ఆందోళన అంటే… ప్రచారం జరుగుతోందని అంట. వివేకా హత్య కేసులో సీబీఐ వాడుతున్న పదాలు, మాటలు ఆయనకు ఇబ్బందికరంగా ఉన్నాయట. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రాగానే.. తాడేపల్లిలో మీడియా ముందుకు వచ్చి సీబీఐపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాము కోరుకున్న టీమే వచ్చినా … తీరు మారకపోయే సరికి మళ్లీ టీడీపీకి అంటగట్టేశారు.
వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ హడావిడి చేస్తోందని….కేసు ముగింపునకు వచ్చినట్లు చిత్రించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే అంశాన్ని..కల్పిత కథను నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తారని… చంద్రబాబును అర్జెంటుగా అధికారంలో కూర్చోబెట్టాలన్నది వీళ్ళ ప్రయత్నమని ఆరోపించారు. కోర్టుల్లో చెప్పుకోవాల్సిన లా పాయింట్లన్నీ మీడియా సమావేశంలో సజ్జల వివరించారు. తానే హత్య చేశానని దస్తగిరి చెప్పాక ముందస్తు బెయిల్ కు సీబీఐ ఎలా ఒప్పుకుందన్నారు. దస్తగిరిని ఎందుకు అరెస్టు చేయటం లేదని ఇది ఒప్పందంలో భాగం కాదా అని సజ్జల ప్రశ్నించారు. సజ్జల వాదన వింటే జగన్మోహన్ రెడ్డి ఆయననే వాదించమని పంపేవారేమో కానీ.. సజ్జల మాత్రం చాలా ఆవేశపడిపోయారు.
సీబీఐ, టీడీపీ కుమ్మక్కై విచారణ జరుపుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి తనదైన శైలిలో అనుమానపడ్డారు. రాంసింగ్ పూర్తి చేయాలనుకున్న పనిని ఈ కొత్త టీం పూర్తి చేయాలని వచ్చినట్లుందన్నారు. ఏప్రిల్ 30వ తేదీలోపు తమకు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతోనే ఈ హడావిడి ద్వారా ఏదో ఒకటి చేసి మమ అని అనిపించాలనుకుంటున్నారని సజ్జల ఆరోపించారు. దస్తగిరి మాటలకు అధిక ప్రాధాన్యం కల్పించి జగన్ ప్రతిష్టను దెబ్బతీయాలను చూస్తున్నారని అంటున్నారు. అడ్డగోలుగా హత్యలు చేసి అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్న వైనం ప్రజల కళ్ల ముందే ఉంది.అయినా సజ్జల అడ్డగోలుగా వాదించి.. గొప్పగా కవర్ చేశానని అనుకుంటున్నారు.