భారతీయుల ఆస్కార్ కలని నిజం చేసింది ఆర్.ఆర్.ఆర్. నాటు నాటు పాట ఆస్కార్ అందుకోవడం భారతీయులందరికీ గర్వ కారణం. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిందిన అరుదైన సందర్భం ఇది. అయితే.. ఈ ఘనతకు తగిన సత్కారం జరిగిందా? లేదా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఆస్కార్ వీరుల్ని ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదు. తెలుగు చిత్రసీమ కూడా తు.తు మంత్రంగా ఓ అభినందన సభ ఏర్పాటు చేసింది. దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్కార్ విజేతల్ని గౌరవించే విధానం ఇదేనా? అంటూ సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి పరిణామల మధ్య ఆస్కార్ విజేతలకు దుబాయ్‌లో ఘనంగా సత్కరించాలని టీఎఫ్‌సీసీ నిర్ణయించుకొంది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో.. టీఎఫ్‌సీసీ నంది అవార్డుల్ని ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డు కార్యక్రమం దుబాయ్‌లో జరగబోతోంది. దుబాయ్ సేట్ చేతుల మీదుగా నంది అవార్డులు అందించనున్నారు. ఇదే వేదికపై కీరవాణి, చంద్రబోస్‌లను.. సత్కరించబోతున్నారు. దుబాయ్ ప్రిన్స్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా రాబోతున్నారు. మే లేదా జూన్లలో ఈ వేడుక జరగబోతోంది. ఈ అవార్డుల వెనుక తెలంగాణ ప్రభుత్వ అండదండలు ఉన్నాయి కాబట్టి… దీన్ని తెలంగాణ ప్రభుత్వం చేయిస్తున్న సత్కారం అనుకోవచ్చు. మరి ఏపీ ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో?