తెలంగాణ పల్లె యువతలో మంచి పట్టు ఉన్న తీన్మార్ మల్లన్న బీజేపీకి గుడ్ బై చెప్పారు. తనను తెలంగాణ ప్రభుత్వం వేధిస్తున్నా… అనేక సార్లు దాడులు చేసి.. కేసులు పెట్టి జైల్లో పెట్టినా కనీసం పట్టించుకోవడం లేదన్న అసంతృప్తితో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. నిజానికి ఇంత కాలం జైల్లో ఉన్నారు. ఆయన కార్యాలయంపై నెలన్నర కిందట దాడి జరిగింది. ఆయనపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. ఇప్పటికి బెయిల్ వచ్చింది. బెయిల్ నుంచి విడుదలైన వెంటనే… కొత్త పార్టీ ప్రకటన చేశారు.
తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు తీన్మార్ మల్లన్న. మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయనున్నట్టు స్పష్టంచేశారు. మంత్రి మల్లా రెడ్డి సొంత నియోజకవర్గమైన మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నట్టు ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆయనపై దాడి చేసింది మల్లారెడ్డి అనుచరులే కావడంతో ఈ ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు.
గతంలో ఇలా ఓ సారి అరెస్ట్ చేసినప్పుడు చాలా కాలం జైల్లో ఉన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ న్యాయసహాయం చేశారు. తీన్మార్ మల్లన్న జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్యను అమిత్ షా వద్దకు తీసుకెళ్లారు. బీజేపీలో చేరేలా ఒప్పించారు. తర్వాత బెయిల్ వచ్చింది. ఒప్పందం ప్రకారం బీజేపీలో చేరారు.కానీ అక్కడా ఎక్కువ కాలం ఉండలేకపోయారు. ఇతర నేతలూ పట్టించుకోలేదు. మళ్లీ జైలుకెళ్లినా ఈ సారి బీజేపీ పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టుకుంటున్నారు.