” నా చిన్న తనంలో జబ్బు చేసి హాస్పిటల్ కు వెళ్లిన క్రమంలో డాక్టర్లు సైతం చేతులు ఎత్తేయగ నా తల్లిదండ్రులు ఒక తాయత్తు కట్టిస్తే అ తాయత్తు మహిమ వల్ల తాను బ్రతికాను” ఈ మాట చెప్పింది ఎవరో సామాన్యులు.. నిరక్ష్యరాస్యులు అయితే అనుకోవచ్చు… కానీ స్వయంగా ఈ మాట చెప్పింది తెలంగాణ హెల్త్ డైరక్టర్ శ్రీనివాసరావు. ఆయన తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే కీలక స్థానంలో ఉన్న వ్యక్తి. ఆయనకి కూడా తాము చేస్తున్న వైద్యాలపై నమ్మకం లేదు. తాయత్తులే పవర్ ఫుల్ అంటున్నారు. తాయత్తు మహిమతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకుంటున్నారు.
ఇంకా రిటైర్ కానీ ఈ ఉన్నతాధికారి ..కేసీఆర్ ప్రాపకాన్ని పట్టేశారు. ఆయనకు రాజకీయలక్ష్యాలున్నాయి. కొత్త గూడెంలో డబ్బులు ఖర్చు పెట్టి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి పండగలు వచ్చినప్పుడు విందులు ఇస్తున్నారు. తాజాగా కొత్తగూడెం క్లబ్ లో డా.జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముస్లింలు అంటే… తాయత్తులేనన్నంట్లుగా చెప్పుకొచ్చారు. అది వారినీ అసంతృప్తికి గురి చేసిది.ఆయన మాటలూ వైరల్ అయ్యాయి.
గతంలో క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవుల గురించి చేసిన వ్యాఖ్యలపైనా విమర్శలు వచ్చాయి. గతంలో క్షుద్రపూజలు చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో డీహెచ్ మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తున్నట్లు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయల కోసం ఇలాంటి ప్రకటనలు చేస్తే చేయవచ్చునని బాధ్యతాయుత స్థానంలో ఉండి.. ఇలా చేయడం వల్ల… ప్రజల ఆరోగ్య నమ్మకాల్ని దెబ్బ తీసినట్లు అవుతుందన్న విమర్శలు వస్తున్నాయి.అయితే ఆయన ఇలాంటివేమీ పట్టించుకోవడం లేదు.