జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు భారతీయ జనతా పార్టీ తరపున అన్ని రోడ్ మ్యాప్‌లు ఇచ్చేశామని ఏపీ బీజేపీ సహ ఇంచార్జ్ సునీల్ ధియోధర్ స్పష్టం చేశారు. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే పవన్ నే అడగాలని మీడియాకు సూచించారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయంలో నిర్వహిస్తున్న జాతీయ స్ధాయి ప్రతిభా పోటీల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ తో కలిసి పోటీ చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నా … పవన్ మాత్రం ఎక్కడా బీజేపీతో కలవడం లేదు. కనీసం నేతలతో భేటీ కూడా నిర్వహించడం లేదు. కలవడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు.
ఇటీవల ఢిల్లీ వెళ్లి రెండు రోజుల పాటు ఉన్నారు. ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్ తో రెండు సార్లు సమావేశం అయ్యారు. జేపీ నడ్డాతో ఒక్క సారి సమావేశం అయ్యారు. కర్ణాటకలో ప్రచారం కోసం అనే ప్రచారం జరిగినా అది ఉత్తదేనని తేలింది. ఆయనను స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బీజేపీ చేర్చలేదు. అంటే పవన్ కల్యాణ్ ప్రచారం బీజేపీ కోసం లేనట్లేనని చెప్పుకోవచ్చు. మరి ఏపీ కోసమే చర్చించారని స్పష్టమవుతుంది. మరి ఏం చర్చించారో ఎవరూ చెప్పలేదు కానీ…ఆ తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు రాలేదు. యధాతథ స్థితి కనిపిస్తోంది.
గతంలో పవన్ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామని.. బీజేపీ ఇంకా స్పందించలేదనే ప్రకటనలు చేసేవారు. ఇప్పుడు పవన్ కు ఇవ్వాల్సిన రోడ్ మ్యాప్ లన్నీ ఇచ్చేశామని సునీల్ ధియోధర్ చెబుతున్నారు. అంటే ఇక నిర్ణయం పవన్ కల్యాణ్ చేతుల్లో ఉందన్నట్లే. మరి పవన్ కల్యాణ్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్నదే సస్పెన్స్ గా మారింది. ఎన్నికల వేడి పెరుగుతున్నా ఆయన ఇంకా జనాల్లోకి రావట్లేదు. అందుకే బీజేపీ నేతలు కూడా అన్నీ ఇచ్చేశామని ఇక పవన్ కల్యాణ్ ఇష్టమని అంటున్నట్లుగా తెలుస్తోంది.