ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వద్దకు అప్పుల కోసం వెళ్ల వారిని సీజన్ల వారీగా మార్చేస్తోంది. మొదట్లో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఢిల్లీలోనే ఉండేది. పెద్ద పెద్ద విగ్రహాలు… తిరుపతి ప్రసాదాలు ఆఘమేఘాలపై పంపడానికి తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేసేవారు. అయితే ఆయన రెండేళ్ల పాటు తిరిగి తిరిగి చేయగలిగినంత చేశారు. ఇక బుగ్గన సార్ అని పిలవగానే… కలవొద్దులే అనే వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో ఆయనను తప్పించి జగన్ స్వయంగా వెళ్లడం ప్రారంభించారు.
కేంద్రం వద్ద గౌరవం పోగొట్టుకున్న ఏపీ ప్రభుత్వం
సీఎం అనే గౌరవంతో అడిగినప్పుడల్లా అపాయింట్మెంట్లు ఇచ్చారు పెద్దలు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు. ఎప్పుడు వెళ్లినా అప్పులు.. అప్పులు అంటూడంతో మొహమాటంతో కొన్నాళ్లు చాన్సిచ్చారు. ఇప్పుడు జగన్ వస్తానన్నా… వద్దులే అంటున్నారు. అందుకే ఇప్పుడు సీఎస్ జవహర్ రెడ్డిని రంగంలోకి దింపారు. ఆయన కేంద్ర అధికారుల వద్ద పడిగాపులు పడి… తమకు బోలెడన్ని నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉందని అవి ఇవ్వకపోయినా పర్వాలేదు అప్పులకు అనుమతి ఇవ్వమని కాళ్లావేళ్లా పడుతున్నారు. కానీ కేంద్రం మాత్రం స్పందించడం లేదు.
అప్పల లెక్కలు చెబితే ఒక్క పైసా రుణమూ దక్కదు !
ఏపీ ప్రభుత్వం ఆర్బీఐ వద్ద తీసుకున్న అప్పులే కాకుండా కార్పొరేషన్ల పేరుతో బ్యాంకుల వద్ద నుండి ఇతర ఆర్థిక సంస్థల వద్ద నుండి కూడా రుణాలు సమీకరిస్తోంది. వీటిని బడ్జెట్ లో చూపించకపోవడం వివాదాస్పదం అవుతోంది. ఈ వివరాలు కావాలని కేంద్రం అడుగుతోంది. కానీ ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ లెక్కలన్నీ స్పష్టంగా ఇస్తేనే ఈ ఏడాది అప్పుల పరిమితిని కేంద్రం నిర్ణయించే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఆర్బీఐ నుంచి ఇప్పులు పుట్టే అవకాశం ఉంది. ఆ వివరాలేమీ ఇవ్వకుడా అప్పులు ఇవ్వాలని కేంద్రం వెంట పడుతోంది. ఆ వివరాలిస్తే కేంద్రం నుంచి ఇక పైసా అప్పునకూ అనుమతి రాదు.
పథకాల బటన్లూ పని చేయడం లేదు !
ఏపీ ప్రభుత్వం అభివృద్ధి కంటే ముందే సంక్షేమ పథకాలకే ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికష్టాలు ఎదురైనా సమయానికి బటన్ నొక్కుతున్నానని సీఎం జగన్ తరచూ చెబుతూంటారు. అయితే ఇటీవలి కాలంలో నిధుల కొరతతో సమయం దాటిపోంది. బటన్ నొక్కిన పథకాలకు కూడా నిధులు చాలా ఆలస్యంగా పడటమో..ఇంకా పడకపోవడమో జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లో పథకాలకు డబ్బులు అందలేదనే లబ్దిదారుల సంఖ్య లక్షల్లో ఉంటోంది. వివిధ పనుల కోసం కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నింటినీ తొక్కి పెట్టడం వల్ల కొండలా పేరుకుపోయాయి.