పాత సచివాలయ భవనాల్ని కూలగొట్టి కొత్త భవనాల్ని నిర్మించి ప్రారంభించిన సీఎం తెలంగాణ పునర్మిర్మాణం అంటే ఇదేనని స్పష్టం చేశారు. కొత్త సచివాలయం ప్రారంభించిన తర్వాత ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణను పునర్నిర్మిస్తామంటే.. కూలగొట్టి మళ్లీ కడతారా అని ఎద్దేవాచేశారన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ సమ్మిళిత అభివృద్ధితో తెలంగాణ ముందుకెళ్తోందన్నారు. యాదాద్రి ఆలయాన్ని పునర్మిర్మించుకున్నామన్నారు. అడవులు పునర్ నిర్మించుకోవడం.. వలస వెళ్లిన పాలమూరు కార్మికులు తిరిగి రావడం అంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త సచివాలయం దానికి నిలువెత్తు సాక్ష్యమన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణ కాంక్షను అర్థం చేసుకోలేక.. కొందరు పిచ్చి కూతలు కూశారు. మరుగుజ్జుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కరవు పాలమూరులో వలసలు లేకుండా చేశాం. నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యను మిషన్ భగీరథతో పరిష్కరించాం. మరుగుజ్జుల్లారా ఇప్పటికైనా మీ కుళ్లును మానుకోండి. సచివాలయం తరహాలోనే తెలంగాణ పల్లెలు వెలుగుతున్నాయి. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ దూసుకుపోతోంది. కలియుగ వైకుంఠంగా యాదాద్రి నిలుస్తోంది. శోభాయమానంగా, శిఖరాయమానంగా సచివాలయంసెక్రటేరియట్ నిలుస్తోంది’’ అని కేసీఆర్ ప్రకటించారు. పండితులు నిర్ణయించిన ప్రకారం ఆరు నిమిషాల్లో ఆరు సంతకాలు పెట్టి కేసీఆర్ సచివాలయన్ని ప్రారంభించారు.
ఒక్క బీఆర్ఎస్ నేతలు మినహా సచివాలయ ప్రారంభోత్సవానికి ఇతర పార్టీల నేతలెవరూ హాజరు కాలేదు. బండి సంజయ్ సచివాలయ నిర్మాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాత సచివాలయమే బాగుండేదన్నారు. నల్లపోచమ్మ ఆలయం నిర్మించలేదని.. మసీదుకు మాత్రం ఐదు గంటల స్థలం ఇచ్చారని విమర్శించారు. మసీదు తరహాలో ఉన్న సచివాలయాన్ని తాము వచ్చాక.. గుమ్మటాల్ని కూల్చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకూ ఆహ్వానాలు అందరినా ఎవరూ హాజరు కాలేదు.