విజయ్ దేవరకొండ, సమంత జంటగా ‘ఖుషి’ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శివ నిర్వాణ. కాశ్మీర్ నేపధ్యంలో ఓ ప్రేమ కథ ఇది. నిన్న విడుదల చేసిన పాట, పోస్టర్స్ లో సమంత బుర్కా తో కనిపించింది. దీంతో ఇది హిందూ అబ్బాయికి, ముస్లిం అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథని చాలామంది అనుకుంటున్నారు. పైగా కాశ్మీర్ నేపధ్యం, పాటలో రోజా అనే పేరు, ముంబాయి సినిమాలో మనిషా గెటప్ వుండటంతో అది హిందూ, ముస్లిం ప్రేమకథే అనే తీర్మానానికి వచ్చేశారు. కానీ ఈ కథలో అసలు పాయింట్ అది కాదు.
నాస్తిక, ఆస్తికులకు మధ్య జరిగే ప్రేమకథ ఇది. అందుకే రెండు ప్రపంచాల కథ ని పోస్టర్ లో వేశారు. పాటలో కనిపించిన సమంత ముస్లిం వేషధారణ కూడా కథనంలో ఓ ట్విస్ట్ వచ్చేలా వుంటుంది. రొటీన్ కి భిన్నంగా ఓ ప్రేమకథని చూపించాలనే ప్రయత్నంలో వున్నాడు దర్శకుడు. ఈ కథ ఆలోచన కూడా కొంచెం కొత్తగానే వుంటుందని వినికిడి. ఇప్పుడు అనుకుంటున్నట్లుగా ‘ఖుషి’ హిందూ ముస్లిం ప్రేమ కథ అయితే కాదు.