ప్రేక్షకుల అభిరుచికి తగ్గ వినోదాన్ని రకరకాల కార్యక్రమాల ద్వారా అందిస్తూ, తగ్గేది లేదంటూ అత్యంత వేగంగా వృద్ధిలోకి దూసుకుపోతుంది ఆహా ఓటీటీ. ఈ క్రమంలోనే ఆహా నుంచి అనేక ఒరిజినల్ సిరీస్ లు, గేమ్ షోస్, సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఈ మే నెలలో అందరికి సుపరిచితమైన గీతా-సుబ్రమణ్యం సీరీస్ సీజన్ 3, నవదీప్- బిందు మాధవి జంటగా న్యూసెన్స్ మొదటి సీజన్, సర్కార్ సీజన్ 3 గేమ్ షో, ఒరిజినల్ మూవీ సత్తిగాని రెండెకరాలు వంటి ఒరిజినల్ కంటెంట్ తో సిద్ధంగా ఉంది.
ఆహ విస్తరణ ప్రణాళిక మరియు మార్కెటింగ్ వ్యూహంలో భాగంగా బద్దం రాజ్ శేఖర్ ను మార్కెటింగ్ హెడ్ గా నియమించడం జరిగింది. ఆహా ప్రారంభం నుంచి అనేక స్థాయిల్లో పనిచేసిన ఆయన తన సరికొత్త ఆలోచనలు, నైపుణ్యంతో ఆహా మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలంగా విస్తరిస్తారస్తారనే నమ్మకం ఉంది. ఆయన నాయకత్వంలో ఆహా మరిన్ని కోట్లమంది ప్రేక్షకులకు చేరవవుతుందని ఆహా యాజమాన్యం విశ్వసిస్తుంది.
ఆహా నూతన మార్కెటింగ్ హెడ్ రాజ్ శేఖర్ గురించి సీఈశో రవికాంత్ సబ్నవిస్ మాట్లాడుతూ ‘ ఈ కీలక పదవిలో రాజ్ శేఖర్ ను నియమించడం పట్ల ఆనందంగా ఉంది. అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీ కే, తెలుగు ఇండియన్ ఐడల్, కలర్ ఫోటో, భామాకలాపం, 3 రోజెస్, కుడి ఎడమైతే వంటి ప్రజాదరణ పొందిన షోలు, సినిమాల విస్తృత మరియు వినూత్న మార్కెటింగ్ వెనుక రాజ్ శేఖర్ కృషి అనీర్వచనీయం. ఆహా బ్రాండ్ ను తెలుగు ప్రజలు ఉన్న ప్రతీ చోటుకు తీసుకెళ్లడం వెనుక ఆయన ఎనలేని శ్రమ ఉంది. ఆయన కొత్త ఆలోచనలు, దూరదృష్ఠి, విషయపరిజ్ఞానం ఆహాకు ఎంతో విలువైన ఆస్తులు’ అంటూ పేర్కొన్నారు.
మార్కెటింగ్ రంగంలో మిస్టర్ రాజ్ శేఖర్ కు 13 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందిన ఆయన 2010 లో లాంకో గ్రూప్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. తదనంతర కాలంలో మై హోమ్ గ్రూప్ కార్పోరేట్ కమ్యూనికేషన్ విభాగంలో తన ప్రయాణాన్ని కొనసాగించి తన పని తనంతో అనతి కాలంలోనే బ్రాండ్ గుర్తింపును మరింత విస్తరించేందుకు కృషి చేశారు. ఆయన ప్రతిభను గుర్తించిన యాజమాన్యం తమ గ్రూప్ కంపెనీ అయిన ఆహా మార్కెటింగ్ వ్యవహారాలలో నియమించింది. ప్రస్తుతం అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్థానంలో ఆహా ఉన్నతికి మరిన్ని సేవలను అందించనున్నారు.
ఈ నియామకం పట్ల రాజ్ శేఖర్ స్పందిస్తూ “ ఈ కొత్త బాధ్యతను స్వీకరించడం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. ఇదంతా నా టీమ్ వల్లే సాధ్యమయ్యింది. అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మార్కెటింగ్ హెడ్ గా ఇకపై కూడా ఆహా బ్రాండ్ ను మరింత విస్త్రతంగా ప్రేక్షకుల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత నాపై ఉంది. సరైన వ్యూహంతో, ప్రణాళికతో ముందుకెళుతూ ప్రేక్షకులకు నాణ్యమైన వినోద కార్యక్రమాలను అందించడమే లక్ష్యంగా పని చేసేందుకు నేను సిద్ధం” అంటూ పేర్కొన్నారు.
ఆహా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులకు అపరిమితమైన వినోద కార్యక్రమాలను అందిస్తూ ఓటీటీ రంగంలో ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకుంది. 2000 గంటలకు పైగా ఉన్న వినోద కార్యక్రమాలు, 32 మిలియన్ల డౌన్ లోడ్స్, 12 మిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్లతో పటిష్ఠంగా ఉంది. తెలుగు, తమిళంలో ప్రేక్షకులను రంజింపజేస్తూ విదేశాలైన యూకే, యూఎస్, ఆస్ట్రేలియా మరియు దక్షణాసియా, మలేసియా, సింగపూర్ లో తన సేవలను అందిస్తోంది.