మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తాను అసంతృప్తికి గురయినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు కానీ.. అసలు జగన్ ఆయనకు దారి చూపించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన ఇంత కాలం పక్కన పెట్టిన నేతల్ని తీసుకు వచ్చి కీలక పదవులు ఇస్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరికి రాక ముందు ..తాడేపల్లిలో ఉండే దొందిరెడ్డి వేమారెడ్డి అనే రెడ్డిగారు వైసీపీ తరపున ఖర్చులన్నీ పెట్టుకుని పని చేసేవారు. ఆళ్ల వచ్చిన తర్వాత ఆయనను పక్కన పెట్టేశారు.
జగన్ పాదయాత్ర మంగళగిరిలో జరిగిన సమయంలో ఖర్చులన్నీ పెట్టుకున్న వేమారెడ్డి.. జగన్ గెలిచి సీఎం అయ్యాక ఎమ్మెల్సీ వస్తుందని ఆశ పెట్టుకున్నారు. కానీ లెక్కలోకి తీసుకోలేదు. పార్టీ ఫిరాయించి వచ్చిన మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయిన వేమారెడ్డి ఫీల్ కాలేదు. ఇప్పుడు ఆర్కే.. మెల్లగా పార్టీకి దూరం జరుగుతూండటంతో జగన్ ఆయనను గుర్తించి మంగళగిరి వైసీపీకి అధ్యక్షుడిగా చేసేశారు. దంతో ఆళ్లకు షాక్ తగిలినట్లయింది.
మంగళగిరిలో వైసీపీని గెలిపించే బాధ్యతను ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్న.. ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డికే జగన్ ఇచ్చారు. రాంకీ సంస్థ ఓనర్ అయిన అయోధ్యరామిరెడ్డి డబ్బు సమస్యే లేకుండా చేసి.. పార్టీ ని మంగళగిరిలో గెలిపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి తన సోదరుడు అయితే తట్టుకోలేడని ఆయన కూడా డిసైడయ్యారని అంటున్నారు. మొత్తంగా ఆళ్లకు జగన్ డోర్ చూపించినట్లయిందని చెబుతున్నారు.