ఏపీలో అభివృద్ధి పనులకు డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు. జీతాలకే డబ్బుల్లేక 40 రోజుల్లోనే పది వేల కోట్లు అప్పు తెచ్చారని తేలికగా తీసుకుంటారు. కానీ ప్రభుత్వ పెద్దలకు అవసరమైన వాటికి మాత్రం ఇష్టారీతిన నిధులు మంజూుర చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ పెద్దలకు ఇష్టమైనవి ఒకటి.. అమరావతి విధ్వంసం.. రెండు రుషికొండ అభివృద్ధి. వీటికి విచ్చలవిడిగా నిధులు విడుదల చేస్తున్నారు.
అమరావతి భూమిని సెంటు స్థలాలు చేసి పంచేయడానికి ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం చదును చేయడానికి .. హద్దు రాళ్లు నాటడానికి ఇతర ఏర్పాట్లు చేయడానికి యాభై కోట్లను కేటాయించింది. ఇందులో ఇరవై కోట్లు రిలీజ్ చేసేసింది. టెండర్లు పిలిచారు కానీ ఎవరూ రాలేదు. దాంతో అధికారులే రంగంలోకి దిగి.. తామే జేసీబీలు ఇతర పనులను మాట్లాడి పనులు చేయిస్తున్నారు. మంగళగిరిలో అమ్మకానికి పెట్టిన స్థలాలు.. పేదలకు ఇవ్వొచ్చు కదా..రైతులకు ఇచ్చిన హామీలేమీ నెరవేర్చకుండా వారి భూముల్ని ఎలా పేదలకు పంచుతారంటే మాత్రం ప్రభుత్వంలో స్పందన లేదు. వారి లక్ష్యం రైతుల్ని నాశనం చేయడం . అందు కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారు.
ఇక రుషికొండలో కూడా అంతే. అక్కడ తవ్వాల్సినదంతా తవ్వేసి.. సీఎం క్యాంప్ ఆఫీసు కోసం అంటూ.. వందల కోట్లు ఖర్చు పెట్టి భవనాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు అక్కడ రోడ్లు, కాలువలు నిర్మించేందుకు కూడా యాభై కోట్లు విడుదల చేశారు. అసలు రుషికొండే విధ్వంసం అని.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని కోర్టు కేసులు ఉన్నాయి. కేంద్రం కమిటీ అది అక్రమం అని నివేదిక ఇచ్చింది. హైకోర్టు తీర్పు రావాల్సి ఉంది. అయితే తమ అక్రమాలన్నీ సక్రమం అని గట్టి నమ్మకం ఉందేమో కానీ వారి పని వారు చేసుకెళ్లిపోతున్నారు.
ప్రజాధనం సొంత ధనంగా వాడుకుంటున్న పాలకులు..దాన్ని విధ్వంసానికే వినియోగిస్తూండటంతో ఏపీ ప్రజలు కోరితెచ్చిపెట్టుకున్న కష్టం. ఎంత విధ్వంసంచేసినా .. ఎంత జల్సాలకు ఖర్చు పెట్టినా భరించాల్సిందే.