టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త వాసు, ఆయన తండ్రి అప్పారావులను సీఐడీ అధికారులు చిట్ ఫండ్స్ కేసులో అరెస్ట్ చేశారు. దాదాపుగా పది రోజుల పాటు జైల్లో ఉంచారు. అసలు ఆ కేసులో తప్పు జరిగిందనడానికి ఎలాంటి ఆధారాల్లేవని హైకోర్టు స్పష్టం చేసి బెయిల్ ఇచ్చింది. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మానవహక్కులు సీఐడీ చేతిలో దారుణంగా ఉల్లంఘనకు గురయ్యాయి. మరి దీనికి సీఐడీ అధికారులను శిక్షించరా ? వారిని డిస్మిస్ చేయరా ?
ఎన్నో అరాచక అరెస్టులు – ఒక్క దానిలోనూ లేని సాక్ష్యాలు
సీఐడీ రాజకీయ కక్ష సాధింపులకు ఓ అస్త్రంగా మారింది. రాజ్యాంగాన్ని, న్యాయాన్ని,చట్టాన్ని సీఐడీ అధికారులు పూర్తి స్తాయిలో వదిలేశారు. రాజకీయ బాసులు ఏది చెబితే అది చేస్తున్నారు. అడ్డగోలు అరెస్టులు చేస్తున్నారు. వ్యాపారస్తుల్ని బెదిరిస్తున్నరు. టీడీపీ నేతల్ని అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటి వరకూ సీఐడీ పోలీసులు పెట్టిన కేసుల్లో.. చేసిన అరెస్టుల్లో ఒక్క దాన్ని నిరూపించలేకపోయారు. కనీసం ప్రాథమిక ఆధారాలను కూడా చూపించలేకపోయారు. మరి అరెస్టయిన వారి హక్కులకు ఎవరు బాధ్యత వహిస్తారు ? అక్రమంగా అరెస్ట్ చేసిన వారు బతుకుజీవుడా అని విడుదలవుతారు..కానీ వారి పరువు ప్రతిష్టలకు.. వారిపై జరిగిన వ్యతిరేక ప్రచారానికి ఎవరు బాధ్యత వహిస్తారు ?
పోలీసులు తప్పుడు అరెస్టులు చేయడం క్షమించరాని నేరం
తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయడం అనేది పోలీసు వ్యవస్థకు కళంకం.. ఎవరూ క్షమించరాని నేరం. ఈ అంశంపై చట్టంలో స్పష్టమైన రూల్స్ ఉన్నాయి. పోలీసులకు నేరస్తుల్ని పట్టుకునే అపరిమితమైన అధికారాలతో పాటు అవి దుర్వినియోగం కాకుండా మాన్యువల్స్ కూడా ఉన్నాయి. కానీ ఓ నేరస్తుని చేతిలో ఉన్న ప్రభుత్వంలో … పోలీసు వ్యవస్థలో కలుపు మొక్కలు లాంటి అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకుని.. వారిపై ఉన్న అభియోగాల్ని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ.. తమకు కావాల్సిన పని చేయించుకుంటున్నారు పాలకులు. ఇక్కడే వ్యవస్త పూర్తిగా నాశనమైపోయింది.
అభియోగాలున్న పోలీసుల్ని సీఐడీలో చేర్చి ప్రభుత్వ అరాచకం – అంతం ఎప్పుడు ?
అన్ని వ్యవస్థలూ విఫలమైన చోట.. ప్రజల్ని కాపాడాల్సింది న్యాయవ్యవస్థే. సీఐడీ అరాచకాలకు బలైన వారిని వదిలి పెట్టడమే కాదు.. ఇలా తప్పుడు పనులు చేస్తున్న అధికారులైప కఠిన చర్యలు తీసుకుంటే ఇతర అధికారులూ తప్పుడు పనులు చేయడానికి భయపడతారు. గత నాలుగేళ్లుగా సీఐడీ అధికారులు ఎన్ని అరచకాలు చేసినా ఎమీ కాకపోవడంతో వారిలోనూ ధైర్యం పెరిగింది. ప్రభుత్వ అండ ఉంటుంది కాబట్టి ప్రమోషన్లు వస్తాయని ఆశ పడుతున్నారు. దీంతో వ్యవస్థ కలుషితం అయిపోయింది. దీన్ని సంస్కరించాల్సి ఉంది.