వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికి ఇది ఏడో సారి. ఆయనను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తేనే చాలా విషయాలు తెలుస్తాయని సీబీఐ కోర్టుకు చెబుతోంది కానీ వారాలు గడుస్తున్నా అరెస్టులు మాత్రం చేయడం లేదు. తాజాగా మరోసారి కోటి సీబీఐ ఆఫీసుకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఇవి ఇంతకు ముందే అందాయా లేదా అన్నది తెలియదు కానీ.. సోమవారం వెలుగులోకి వచ్చాయి. మధ్యాహ్నం మూడు గంటలకు కోఠి సీబీఐ ఆఫీసుకు రావాలని నోటీసుల్లో ఉంది.
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర పై ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు దృష్టికి కీలక అంశాలు తీసుకెళ్లింది. వివేకా హత్య కేసు వెనుక జరిగిన కుట్రలో ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఆయన ద్వారా తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది. అవినాష్ పాత్ర పైన ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసిందని వివరించింది. గుండెపోటు అంటూ హత్యను దాచిపెట్టటం, సాక్ష్యాల విధ్వంసం, కుట్రలో అవినాష్ భాగమైనట్లు తేలినప్పటికీ సమాధానాలు ఎగవేసి, తప్పుదోవ పట్టించారని వివరించింది. దీంతో కస్టోడియల్ విచారణ అవసరమని కోర్టుకు నివేదించింది. అందుకే అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అరెస్ట్ చేయదల్చుకుంటే.. నేరుగా అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారని విచారణకు పిలువడం ఎందుకన్న వాదన ఉంది. కానీ పులివెందుల నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం కన్నా..విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తే లేనిపోని తలనొప్పులు ఉండవని సీబీఐ అధికారులు ఆలోచిస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. అయితే తనను అరెస్ట్ చేయకుండా అవినాష్ రెడ్డి .. ఆయన తరపున సీఎం జగన్ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఎంత వరకు వర్కవుట్ అవుతాయన్నది తేలాల్సి ఉంది.
కొసమెరుపేమిటంటే.. ఏదో జరగబోతోందని డైవర్షన్ కోసం సీఐడీ అధికారులు ఆస్తుల జప్తు అంటూ నాటకాలాడారని… ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో అవినాష్ రెడ్డి నోటీసులు వెలుగులోకి వచ్చాయి.