రథయాత్రతో ఉత్తరాది ప్రజల్లో మతం మత్తు ఎక్కిన బీజేపీకి దక్షిణాది కొరకరాని కొయ్యగా మారింది. హిందూ దేవుళ్లను ఎప్పటికప్పుడు వివాదం లోకి తెస్తూ.. తామే వారిని కాపాడుతామన్నట్లుగా ప్రకటలు చేస్తూ.. హిందువుల్లో ఓటు బ్యాంక్ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేసే బీజేపీకి .. ప్రతీ సారి షాక్ తగులుదూనే ఉంది. దక్షిణాదిన బీజేపీ మత రాజకీయాలను ప్రజలు ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నారు. కర్ణాటకలో అదే జరిగింది.
హిజాబ్, హలాల్, హనుమాన్ ..అన్నీ కర్ణాటకలో పారలేదు !
ప్రజలు ఇవ్వని అధికారాన్ని రూ. కోట్లు పెట్టి ఎమ్మెల్యేల కొనుగోలు ద్వారా పొందిన పొందిన అధికారాన్ని కమిషన్ల కోసం ఉపయోగించుకున్న బీజేపీ.. మతం కార్డు వాడింది. మతం ప్రాతిపదిక విభజన తెచ్చి కర్ణాటకలో పాతుకుపోదామని ప్రయత్నించింది. హిజాబ్ వివాదం తెచ్చారు. హలాల్ అన్నారు. చివరికి క్లైమాక్స్‌లో బజరంగ్ దళ్ అంశాన్ని ఎత్తుకున్నారు.కానీ ఫలితాలు చెప్పిందేమిటంటే మత రాజకీయాలు చేస్తే పడిపోవడానికి తమది ఉత్తరాది కాదు.. దక్షిణాది అనే. దక్షిణాది ప్రజల్లో మత సామరస్యం ఎక్కువ. ఎవరి నమ్మకాలు వాళ్లవి. అందరూ అందర్నీ గౌరవిస్తారు. చిచ్చు పెట్టాలనుకుంటే సాధ్యం కాలేదు. పెట్టాలని బీజేపీ చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు.
కేరళలో అయ్యప్పను వివాదంలోకి తెచ్చి ఇప్పటికే శిక్ష అనుభవించారు !
కేరళలో అడుగుపెట్టేందుకు గతంలో బీజేపీ అయ్యప్ప స్వామినే వివాదంలోకి తెచ్చింది. అయ్యప్ప స్వామి ఆలయంలోకి వయసుతో నిమిత్తం లేకుండా మహిళలందరినీ అనుమతించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత బీజేపీ ఎంత రాజకీయం చేయాలో అంతా చేసింది. కానీ ప్రజలు అడుగు పెట్టనీయలేదు. ఇక తమిళనాడులో తరచూ పెరియార్ పై దాడి చేసి..ఆయన భావాలకు వ్యతిరేకంగా ఉన్నవారిని మద్దతుదారులుగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ ప్రజలే పడనీయడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడటం దుర్లభం అనే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో అదే హిందూ నినాదంతో బండి సంజయ్ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. తెలంగాణ ప్రజలూ షాకిస్తే మొత్తం సంపూర్ణం అవుతుంది.
ఉత్తరాది ప్రజల్ని బకరాల్ని చేస్తున్న బీజేపీ !
బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే ముద్ర ఉంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటానికి కారణం ఉత్తరాది లో వచ్చే సీట్లే. 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ… ఘన విజయం సాధించింది. అయితే ఈ ఘన విజయం మొత్తం హిందీ రాష్ట్రాల్లోనే వచ్చింది. దక్షిణాదిలో కేవలం కర్ణాటకలో మాత్రమే కాస్త ఫలితం చూపించగలిగింది. వచ్చే ఎన్నికల్లో అదీ ఉండదు. మతం పేరుతో.. దేశభక్తి పేరుతో బీజేపీ.. ఉత్తరాది ప్రజల్ని మైకంలో ముంచెత్తుతోంది. వారు కూడా వాస్తవాల్ని తెలుసుకుంటే.. అసలు సినిమా ప్రారంభమవుతుంది.