బీజేపీని ఎదుర్కొనేది బీఆర్ఎస్సే అందుకే దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచినా తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ తో నడుస్తామని మునుగోడు ఉపఎన్నికల సమయంలో కమ్యూనిస్టు పార్టీల నేతలు చెప్పుకొచ్చారు. వారి తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అయితే ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు కేసీఆర్తో రాజకీయాలు ఎలా ఉంటాయో క్లారిటీ వచ్చేసింది. అవసరం ఉన్నప్పుడు ప్రగతి భవన్ కు పిలిచి విందులు ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదు. కలసి పని చేద్దామన్నారు కదా.. ఏం చేద్దాం అని అడిగే అవకాశం లేకుండా చేశారు.
మునుగోడు ఉపఎన్నికల సమయంలో కేసీఆర్..కమ్యూనిస్టులతో కలిసి రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలోనూ కలిసి పని చేస్తామని ప్రకటించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాతజాతీయ రాజకీయాలను ప్రారంభించిన కేసీఆర్ కమ్యూనిస్టులను చేరదీశారు. వచ్చే ఎన్నికల్లోనూ కలిసి పనిచేద్దామని మునుగోడు ఉపఎన్నికల్లో వారి మద్దతు పొందారు. బీఆర్ఎస్ విజయంలో వారి ఓట్లు కీలకమయ్యాయి. కానీ ఇప్పుడు కేసీఆర్ ఆ లెఫ్ట్ పార్టీల గురించి మాట్లాడటం లేదు. కనీసం పిలిచి మాట్లాడటం లేదు. వారు కొన్ని స్థానాలు అడుగుతూండటమే కారణం.
సీపీఐ జాతీయ నేత నారాయణ.. కేసీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సరైన స్పందన రావడం లేదని.. అలాగని తామేమీ సన్యాసం తీసుకోలేదని ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామంటున్నారు. అంటే టీఆర్ఎస్ పొత్తులు పెట్టుకుంటే సీట్లివ్వాలి.కానీ ఇప్పుడు ఒక్క సీటు కూడా కేటాయించే అవకాశం లేదు. అలాంటి సూచనలు కూడా కేసీఆర్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఒక్క సారిగా సీన్ మరిపోయే పరిస్థితివచ్చింది. ఈ కారణంగా కాంగ్రెస్ వైపు కమ్యూనిస్టులు చూస్తున్నారని అంటున్నారు. ఇలాంటి అవకాశాల్ని కాంగ్రెస్ ఖచ్చితంగా అంది పుచ్చుకుంటుందని.. చెబుతున్నారు. అదే జరిగితే.. ఖమ్మం , నల్లగొండ వంటి జిల్లాల్లో కాంగ్రెస్ కు చాలా కీలకమైన ఓట్లు యాడ్ అవుతాయి. మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది.