ప్రజాధనంతో పెడుతున్న రాజకీయసభలా లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలా అన్న తేడా లేకుండా అంతా వైసీపీవే అన్నట్లుగా మార్చేసిన సీఎం జగన్.. మాట తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గత ఏడాది నా వెంట్రుక కూడా పీకలేరంటూ ప్రసంగాలు చేసేవారు. ఇప్పుడు వాళ్లు పొత్తులు పెట్టుకుంటున్నా బాబోయ్.. మీరే మీ బిడ్డను కాపాడాలంటూ ప్రజల్ని వేడుకుంటున్నారు. మత్య్సకార భరోసా పేరుతో 120 కోట్లను విడుదల చేసేందుకు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన చంద్రబాబు, పవన్ ను కసి తీరి తిట్టడానికే అత్యధిక సమయం కేటాయించారు.
ఇటీవల పొత్తులపై పవన్ చేసిన చేసిన ప్రకటనలపై జగన్ మండిపడ్డారు. జేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నది వీల్లే. పెళ్లి చేసుకున్నది వీల్లే.. విడాకులు ఇచ్చేది వాళ్లే..మళ్లీ పెళ్లి చేసుకున్నది వీల్లే.. మళ్లీ విడాకులు ఇచ్చేది వీల్లే. చంద్రబాబు కలిసి వెళదాం అన్నారు… దత్తపుత్రుడు చిత్తం ప్రభు అన్నారు. చంద్రబాబుకు ఏది మంచి జరిగితే అలాగే చేస్తానని దత్తపుత్రుడు చెబుతారు. పోటీ వద్దని చెబితే అలాగే చేస్తాడు. చంద్రబాబు గాజువాక రానంటారు, దత్తపుత్రుడు మంగళగిరిలో పోటీ పెట్టకుండా ఆగుతాడు. చంద్రబాబు చెబితే బీజేపీతో దత్తపుత్రుడు తెగదెంపులు చేసుకుంటారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీల కోసం దత్తపుత్రుడు ఏం చేయటానికైనా వెనకాడరు. ఇలాంటి అన్యాయమైన రాజకీయాలు చేయటానికి వారితో పాటు గజ దొంగల ముఠా సిద్ధంగా ఉంటుందన్నారు.
విచిత్రం ఏమిటంటే ఇన్ని చెప్పిన ఆయన తాను కేంద్రంలో ఎవరిని కలిసినా ప్రజల కోసమేనని చెప్పుకొచ్చారు. నాలుగేళ్లలో ఎన్నో సార్లు ఢిల్లీకి వెళ్లారు కానీ రాష్ట్రానికి రావాల్సిన వాటిని కూడా తీసుకు రాలేకపోయారు. పోలవరం దగ్గర్నుంచి ఏ ఒక్క అభివృద్ధి పనులకు నిధులు తేలేకపోయారు . కానీ తనపై కేసులు మందుకు జరగకుండా చూసుకున్నారు. వివేకా హత్య కేసులో నిందితుల్ని కాపాడుతున్నారు. అన్నీ తెలిసినా రాష్ట్రానికేదో మంచి చేసినట్లుగా కన్నార్పకుండా అబద్దాలు చెప్పడంలో జగన్ రాటుదేలిపోయారు. ప్రసంగంలో మీ బిడ్డకు మీరు తోడుగా నిలవాలని ప్రజల్ని పదే పదే వేడుకున్నారు. నేను కేవలం మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాననని దీనవదనంతో మాట్లాడే ప్రయత్నం చేశారు.
ఎవరు ఎలా పొత్తులు పెట్టుకుంటే నీకేంటి అనే ప్రశ్న సహజంగానే వస్తుంది కానీ.. ఇలా మీరు ఒంటరిగా రండి.. వచ్చే ధైర్యం లేదా అని ప్రకటనలు చేయడం వల్ల జగన్ భయపడుతున్నట్లుగా జనంలోకి వెళ్లిపోతుందని.. అదే జరుగుతోందని ఆయన ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.