అశ్వినీదత్ కుమార్తెలు వ్యాపార సూత్రాల్ని, సినిమా పాఠాల్నీ బాగానే అర్థం చేసుకొన్నారు. సంస్థ తమ చేతుల్లోకి వచ్చాక… మంచి సినిమాలు తీస్తున్నారు. అవి కూడా లాభాలు తెచ్చి పెట్టి, సంస్థ గౌరవాన్ని కాపాడే సినిమాలే. మహానటి, జాతి రత్నాలు, సీతారామం.. ఇలా అన్నీ మర్చిపోలేని సినిమాలే. తాజాగా.. ‘అన్నీ మంచి శకునములే’ సినిమా తీశారు. ఇందులో సంతోష్ శోభన్ హీరో. చిన్న హీరో సినిమా కదా అని, చిన్నగా ఖర్చు పెట్టలేదు. ఆ హీరో స్థాయికీ, మార్కెట్‌కీ నాలుగు రెట్లు పోసి సినిమా తీశారు. విచిత్రం ఏమిటంటే.. నాన్ థియేటరికల్ రైట్స్ రూపంలోనే ఆ సినిమా పెట్టుబడి తిరిగి వచ్చేసింది. అమేజాన్ ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకొంటే, జీ చేతికి శాటిలైట్ చిక్కింది. దాదాపు రూ.20 కోట్లు వీటి రూపంలోనే వెనక్కి వచ్చాయి. విచిత్రం ఏమిటంటే… సంతోష్ శోభన్‌కు ఒక్క థియేట్రికల్ హిట్ లేదు. తన సినిమాలన్నీ ఫ్లాపులే. ఇలాంటి దశలో సంతోష్ పై రూ.24 కోట్లు పెట్టి, వాటిని నాన్ థియేట్రికల్ రూపంలో తిరిగి రాబట్టడం సామాన్యమైన విషయం కాదు. ఈ సినిమా కోసం నిర్మాతలు చేసిన ప్రమోషన్ బాగా ప్లస్ అయ్యింది. ఓ కంప్లీట్ ఫ్యామిలీ సినిమా చూడబోతున్నామన్న భరోసా.. టీజర్, ట్రైలర్‌తో కలిగింది. అందుకే మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమాని నిర్మాతలే సొంతంగా విడుదల చేసుకొంటున్నారు. అంటే.. థియేటర్ నుంచి వచ్చిన ప్రతీ పైసా లాభమే అన్నమాట. ఈ వేసవిలో ఇంత వరకూ సరైన సినిమా రాలేదు. ‘విరూపాక్ష’ హిట్ అయినా.. ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఓ మంచి సినిమా బాకీ. ఆ లోటు… ‘అన్నీ మంచి శకునములే’ తీరుస్తుందేమో చూడాలి.