‘రామబాణం’ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. గోపీచంద్, శ్రీవాస్ లది హిట్ కాంబినేషన్. ఆ కాంబినేషన్ పై నమ్మకంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రామబాణంను ఎక్కడా రాజీపడకుండా నిర్మించింది. ప్రమోట్ చేసింది. కానీ ఫలితం మాత్రం దారుణంగా వచ్చింది. పాత చింతకాయ పచ్చడి లాంటి కథ, కథనాలు, ఓల్డ్ స్కూల్ డైరెక్షన్..రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఏ మాత్రం ఆసక్తిని కలిగించలేకపోయింది.
ఇప్పుడు రామబాణం నుంచి వస్తున్న డిలెటెడ్ సీన్లు చూస్తుంటే.. ఇంత వృధా ఖర్చు ఎలా చేశారనే అభిప్రాయం వ్యక్తమౌతుంది. బేసిగ్గా హిట్ సినిమాల డిలెటెడ్ సీన్లు వదులుతుంటారు. కానీ ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్న రామబాణం డిలెటెడ్ సీన్లు వరుసగా వదులుతున్నారు. ఇవి కూడా పెద్ద ఆసక్తికరంగా లేవు.
ఈ సినిమా బడ్జెట్ 45 కోట్లుకి దాటిందని వినిపించింది. ఇంత రొటీన్ సినిమాకి అంత ఎలా ఖర్చు అయ్యిందనే ప్రశ్నకు డిలెటెడ్ సీన్లు సమాధానం ఇచ్చినట్లయింది. అడిగింది ఇస్తారనే పేరు పీపుల్ మీడియా నిర్మాతలకు వుంది. అయితే ఇలా ఇష్టమొచ్చిన పుటేజ్ ని తీసి సినిమాలో వాడకపోవడం దర్శకుడి వైఫల్యం కిందకే వస్తుంది. శ్రీవాస్ కెరీర్ లో చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా ఇది. సినిమా రిజల్ట్ పక్కన పెడితే వృధా ఖర్చు విషయంలో నిర్మాతలు అలోచించుకునే పరిస్థితి నెలకొంది.