ఢిల్లీ లిక్కర్ స్కాం తర్వాత చత్తీస్ ఘడ్లో లిక్కర్ స్కాం జరిగిందని ఈడీ కేసులు పెట్టింది. కానీ ఏపీ సంగతేమిటన్న ప్రశ్న కొద్ది రోజులుగా అందరికీ వస్తోంది. ఈ రోజూ ఈనాడు పత్రిక ఈ అంశాన్ని హైలెట్ చేసింది. ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది. చత్తీస్ గఢ్లో జరిగిన స్కాం కన్నా ఏపీలో స్కాం చాలా పెద్దది. కొన్ని వేల కోట్లు నగదు రూపంలో లావాదేవీలు జరుగుతున్నాయి. దర్యాప్తు అంటూ ప్రారంభిస్తే పెద్ద తలకాయలు ఈడీగా దొరికిపోతాయి. అటు ఢిల్లీ.. ఇటు చత్తీస్ ఘడ్ స్కాంలను చూసిన తర్వాత ఏపీ లిక్కర్ పాలసీ గురించి ఎవరైనా తెలుసుకుంటే.. ముందు అసలు చరిత్రలో కనీ వినీ ఎరుగని స్కాం ఇక్కడ జరిగి ఉంటుంది కదా అన్న అభిప్రాయం ఎవరికైనా వస్తుంది.
ఎందుకంటే.. మద్యం వ్యాపారం మొత్తం ప్రభుత్వ పెద్దల గుప్పిట్లో ఉంది. అమ్మేది ప్రభుత్వం పేరు మీద. కానీ అందులో మనుషులు దగ్గర్నుంచి లిక్కర్ బ్రాండ్లు, రవాణా సహా మొత్తం అయిన వాళ్ల గుప్పిట్లోనే ఉంది. పైగా అంతా పూర్తిగా నగదు లావాదేవీలు. ఎన్ని వేల కోట్లు వెనకేశారో చెప్పడం కష్టం. అలాంటి స్కాంపై ఇంకా కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టలేదు. ఇప్పుడు పెట్టాలన్న ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కోకుండా..దక్షిణాది నుంచి కొంత బలం ఉండాలంటే నమ్మకమైన మిత్రపక్షాలను వెదుక్కోవాల్సిన అవసరం బీజేపీకి పడింది. జగన్మోహన్ రెడ్డి కేసులు తేల్చే వైపు ఉంటారు.కేసుల అవసరాలకే ఆయన బీజేపీ వైపు ఉంటున్నారు. ఆ మాత్రం తెలియకుండా తమపై అభిమానంతో ఉంటున్నారని బీజేపీ పెద్దలు అనుకోలేరు. ఇప్పుడు టీడీపీతో పొత్తు అంటూ ప్రచారం చేస్తున్నారు.
అలాంటి పొత్తు ఉండాలంటే వైసీపీకి దూరం అనే నమ్మకం కల్పించాలని టీడీపీ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది.అది జరగాలంటే.. మొదటి ప్రయత్నంగా ఈ లిక్కర్ పాలసీపై దర్యాప్తు చేయాలన్న సంకేతాలను పంపించారు. ఇప్పుడు చాయిస్ బీజేపీ చేతుల్లో ఉంది. వైసీపీకి దగ్గర కాదు అని నిరూపించుకుంటారా.. వైసీపీ చాలు అనుకుంటారా అనేదే .. ఇప్పుడు బీజేపీ క్లారిటీ ఇవ్వాల్సిన విషయం. ఆ సమయం వచ్చేసిందని ఈనాడు సందేశం పంపిందని అనుకోవచ్చు.