ఇతర దేశాల్లో వేధింపులు, కష్టాలు భరించలేక మన దేశానికి వచ్చే వారిని ఆదుకోవడం మన బాధ్యత, వాళ్లకు భారత దేశమే దిక్కని ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే చెప్తుంటారు. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఆయన ప్రభుత్వం ఓ కీలక విధాన నిర్ణయం తీసుకోబోతోంది. పాకిస్తాన్ నుంచి భారత్ కు వచ్చి దీర్ఘ కాలిక వీసాపై నివసిస్తున్న హిందువులకు త్వరలో ఆస్తి హక్కు కల్పించబోతున్నారు. వారు బ్యాంకు ఖాతాలు తెరిచే అవకాశం కల్పిస్తారు. అలాగే వారు ఆస్తులు కొనుక్కునే హక్కు కల్పిస్తారు. ఈమేరకు త్వరలోనే ఉత్తర్వులు రానున్నట్టు ప్రధాని కార్యాలయ వర్గాలు తెలిపాయి.
దేశ విభజన తర్వాత పాకిస్తాన్ లో ఉండిపోయిన హిందువులు వేధింపులను భరిస్తూ జీవిస్తున్నారు. చాలా మంది బలవంతంగా మంత మారిపోయారు. ఇంకా హిందువులుగా ఉన్న వారు ద్వితీయ శ్రేణి పౌరుల్లా బతుకుతున్నారు. అలా బతకలేని వారు భారత్ కు వస్తున్నారు. ఇప్పుడు వారికి తగిన హక్కులు కల్పించాలని మోడీ ప్రభుత్వం యోచిస్తోంది.
మరో విషయంలోనూ మోడీ ప్రభుత్వం ఉదారంగా, మానవీయ కోణంలో వ్యవహరిస్తోంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులకు కొన్ని నిబంధనల ఆధారంగా భారతీయ పౌరసత్వం లభిస్తుంది. యూపీఏ హయాంలో సుమారు వెయ్యి మందికి ఈ అవకాశం లభించింది. మోడీ ప్రధాని అయిన తర్వాత గత ఏడాదిలోనే సుమారు నాలుగు వేల మందికి భారతీయ పౌరసత్వం లభించింది. ఇప్పుడు బ్యాంకింగ్ సౌకర్యం, ఆస్తిహక్కు కల్పించాలని నిర్ణయించడం పాక్ హిందువులకు ఎంతో ఊరటనిచ్చే విషయం.