హైదరాబాద్: దేశ చలనచిత్ర చరిత్రలో కనీవినీ ఎరగనివిధంగా రికార్డులు సృష్టిస్తున్న బాహుబలి త్వరలో అంతర్జాతీయంగాకూడా సినీ అభిమానులను అలరించబోతోంది. ఈ చిత్ర ఇంటర్నేషనల్ వెర్షన్ త్వరలో విడుదల కాబోతోంది. ఈ వెర్షన్‌కు, ఇండియాలో విడుదలైన బాహుబలికి చాలా వ్యత్యాసముంటుంది. ఆంగ్ల చిత్రాల అభిమానుల అభిరుచికి అనుగుణంగా చిత్రాన్ని ఎడిట్ చేస్తారు. దీనికోసం ఇప్పటికే హాలీవుడ్‌కు చెందిన ప్రఖ్యాత ఎడిటర్ విన్సెంట్ తబేల్లోన్ను అర్కా ఫిలిమ్స్‌వారు తీసుకున్నారు. విన్సెంట్ ఇంతకుముందు ఇన్క్రెడిబుల్ హంక్, క్లాష్ ఆఫ్ టైటాన్స్, టేకెన్ 2, తాజాగా వచ్చిన నౌ యు సీ మి చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు.
మరోవైపు బాహుబలి రికార్డులపర్వం కొనసాగుతోంది. నైజాం ఏరియాలో ఆరురోజులకే రు.20 కోట్లు వసూలుచేసింది. మగధీర, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత ఇంత మొత్తాన్ని వసూలుచేసిన చిత్రం బాహబలే. అయితే ఆ మొత్తాన్ని అతి తక్కువ కాలంలోనే వసూలుచేసి రికార్డ్ సృష్టించింది. ఈ వారాంతానికి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావటం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.