ఓ సినిమా ఫ్లాప్ అయితే, డిస్టిబ్యూటర్లు నిర్మాత మధ్య సెటిల్ మెంట్లు మొదలైపోతాయి. నిర్మాత డబ్బులు డబ్బులు వెనక్కి ఇచ్చేయడమో, లేదంటే ‘వచ్చే సినిమాలో చూసుకొందాం’ అని సర్దుబాటు చేసుకోవడమో జరిగిపోతుంది. రన్నింగ్ ప్రొడ్యూసర్ అయితే డిస్టిబ్యూటర్లకూ ధీమా. తరవాతి సినిమాలో చూసుకోవచ్చులే.. అని. ‘ఏజెంట్’ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమాకి అనిల్ సుంకర నిర్మాత. సినిమా డిజాస్టర్ అయ్యింది. డిస్టిబ్యూటర్లంతా నష్టపోయారు. భోళాశంకర్ సినిమాతో నష్ట పరిహారం చేస్తానని అనిల్ సుంకర కొంతమందికి మాట ఇచ్చాడు కూడా. ముఖ్యంగా ‘ఏజెంట్’ సినిమాని గాయత్రీ ఫిల్మ్స్ సొంతం చేసుకొని, తీవ్రంగా నష్టపోయింది. భోళా శంకర్ వైజాగ్ హక్కుల్ని గాయత్రీ ఫిల్మ్స్‌కి ఇస్తానని అప్పట్లో అనిల్ సుంకర మాట ఇచ్చారట. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోకుండా భోళా హక్కుల్ని విఘ్నేశ్వర ఫిల్మ్స్ చేతిలో పెట్టారు. దాంతో.. రగడ మొదలైంది. వైజాగ్ విషయంలోనే కాదు, అన్ని చోట్లా ఇదే గొడవని టాక్.
నిజానికి ఏరియా రైట్స్ ఎవరికి ఇవ్వాలన్న విషయం ఒక్కోసారి నిర్మాత చేతుల్లో కూడా ఉండదు. హీరోల ఆబ్లికేషన్ ప్రకారం సినిమాల్ని అమ్ముకోవాల్సి ఉంటుంది. అనిల్ సుంకర కూడా ఇదే మాట చెబుతున్నాడట. ‘హీరోగారి అబ్బికేషన్ వల్ల… మరొకరికి ఇవ్వాల్సివచ్చింది’ అని చెబుతున్నా డిస్టిబ్యూటర్లు నమ్మడం లేదని, భోళా శంకర్ విడుదలకు ముందే.. ఇదే పెద్ద పంచాయితీ అయ్యే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భోళా శంకర్ విడుదలకు ముందు ఎలాంటి సమస్యా రాకుండా ఉండాలంటే ముందు ఏజెంట్ తలనొప్పుల్ని అనిల్ సుంకర క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది.