కరకట్టపై చంద్రబాబ నివాసం ఉంటున్న గెస్ట్ హౌస్ ను జప్తు చేస్తూ.. సీఐడీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ప్రభుత్వాలు.. సీఐడీలూ ఇలా ప్రైవేటు ఆస్తుల్ని జప్తు చేయలేవు. పైగాఇలా జప్తు ఆదేశాలిచ్చింది ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి ఆర్డినెన్స్ ఆధారంగా. అవి చెల్లుతాయో లేదో తెలియదు. ఆ ఆర్డినెన్స్ ప్రకారం అయినా … కోర్టే ఆటాచ్ చేయగలదు. అధికారికంగా అటాచ్ చేయాలని సీఐడీ కోర్టుకెళ్లింది.
కోర్టులో విచారణ ఇప్పటికి పలుమార్లు వాయిదా పడింది. మొదట ఏసీబీ కోర్టులో విచారణ జరిపినప్పుడు సాయంత్రానికి తీర్పు రిజర్వ్ చేశారు. కానీ తర్వాత వాయిదా వేశారు. మళ్లీ విచారణ జరిపారు. మళ్ల వాయిదా వేశారు. ఇవాళ్టికి విచారణలో న్యాయమూర్తి మళ్లీ పది రోజులకు వాయిదా వేశారు. ఈ దశలో జప్తుపై నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేశారు. ప్రాథమిక ఆధారాలను పరిశీలించాల్సి ఉందని.. ఈ అఫిడవిట్ దాఖలు చేసిన సీఐడీ అధికారిని తమ ఎదుట హాజరు కావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.
ఏపీలో సీఐడీ అధికారులు పెడుతున్న కేసులు.. న్యాయవ్యవస్థకు కూడా చాలెంజింగ్ గా మారుతున్నాయి. అసలు నేరమే జరగకుండా .. జరిగేదని ఊహించేసుకుని కేసులు పెట్టి శిక్షించాలని.. కోర్టుల వద్దకు వెళ్తున్నారు. నేరం చేయబోతే ఆపామని చెప్పి జైళ్లలో వేస్తున్నారు. ఇలాంటి చిత్రవిచిత్రాలతో కోర్టులు కూడా నిర్ణయం తీసుకోవడానికి ఒత్తిళ్లకు గురవుతున్నాయి.