అత్యంత బలమైన అధికార కేంద్రంతో ఢీ కొడుతూ.. అలుపెరుగని పోరాటం చేస్తున్నారు సునీతారెడ్డి. వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో సీబీఐ మోపిన అభియోగాలను హైకోర్టు సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని … తీర్పులో లోపాలు ఉన్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. అవినాష్ పై మోపిన అభియోగాలన్నీ తీవ్రమైనవి సునీత రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. బుధవారం సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు ఈ పిటిషన్ పై విచారణకు జరిగే అవకాశం ఉంది.
అవినాష్ రెడ్డి కి బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి వివాదాస్పదంగా మారాయి. సాక్ష్యాలు తుడిచేస్తే నష్టమేంటని.. వాటిని అవినాష్ రెడ్డే తుడిచేసినట్లు లేదా తుడిపించేసినట్లు సాక్ష్యాలు లేవని ఇలా చేసిన కామెంట్ల ఆధారంగా సునీత రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్రపై స్పష్టమైన టెక్నికల్ ఎవిడెన్సులు ఉన్నాయని.. రహస్య సాక్షి వాంగ్మూలం కూడా ఉందని..సీబీఐ కోర్టుకు చెప్పినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. దీనిపై సునీతరెడ్డి తీర్పును పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు లో పిటిషన్ వేశారు.
వెకేషన్ బెంచ్ విచారణ జరపనుంది. గతంలో కూడా గంగిరెడ్డి బెయిల్ ఆర్డర్స్ ను సునీత సుప్రీంకోర్టుకు వెళ్లి రద్దు చేయించారు. ఆ ఆర్డర్స్ ను చూసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా తల పట్టుకున్నారు. అవినాష్ రెడ్డి కేసులో తెలంగాణ హైకర్టు తీర్పులు చూసి సుప్రీంకోర్టు పలుమార్లు ఆశ్చర్యపోయింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.