భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైంది ఆదిపురుష్. ఇప్పటికే టీజర్,ట్రైలర్ వచ్చేశాయి. టీజర్ చూసి చాలామంది పెదవి విరిచారు. అయితే ట్రైలర్ అందరినీ సంతృప్తి పరిచింది. ఇప్పుడు రిలీజ్‌కి ముందు మరో ట్రైలర్ వచ్చింది. దాదాపు రెండు నిమిషాల 20 సెకన్ల పాటు సాగిందీ ప్రచార చిత్రం. రావణుడు, సీతని ఎత్తుకుపోయిన దగ్గర్నుంచి మొదలైంది. ఆ తరవాత.. హనుమంతుడు లంకకు వెళ్లడం, రాముడు వస్తే కానీ, అయోధ్యలో అడుగుపెట్టను అని సీత చెప్పడం, ఆ తరవాత రాముడే రావణుడిపై యుద్ధం ప్రకటించడం.. ఇలా.. ఆదిపురుష్ కథని మూడు ముక్కల్లో చెప్పేశారు. పాత ట్రైలర్ తో పోలిస్తే.. చాలా కొత్త షాట్లు ఇందులో కనిపించాయి. ముఖ్యంగా రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో.. ఈ ట్రైలర్ లో చూపించారు. సీజీ వర్క్స్ బాగున్నాయి. త్రీడీలో ఆ ఎఫెక్ట్ ఇంకొంచెం బాగా కనిపిస్తుందన్న నమ్మకం కలుగుతుతోంది.
రాముడి కథ జగమెరిగినదే. ఇందులో కొత్తగా చెప్పేదేం లేదు. కాకపోతే… విజువల్ గా ఈ సినిమా ఎలా వచ్చిందన్నది అందరి ఆసక్తి. ఎందుకంటే ఈమధ్య గ్రాఫిక్స్ మాయాజాలంతో అద్భుతాలు సృష్టిస్తున్నారంతా. గొప్ప సాంకేతిక నైపుణ్యం అందుబాటులో ఉంది. దాన్ని వాడుకొంటే.. వెండి తెరపై ఓ దృశ్యకావ్యం సృష్టించొచ్చు. టీజర్, ట్రైలర్ చూసి ఈ సినిమాలో విజువల్స్ ఎలా ఉండబోతున్నాయి? అనేది ఓ అంచనాకి రావడం కష్టమే. ఎందుకంటే బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ వేరు. రామ – రావణ యుద్ధాన్ని ఏ రేంజ్లో చూపిస్తారు? రావణ బ్రహ్మ పాత్రలో సైఫ్ ఎలా సరిపోతాడు? అనేదే అందరి దృష్టి. ఈ రెండు విషయాల్లో సక్సెస్ అయితే.. ఆదిపురుష్‌ని ఎవరూ ఆపలేరు.