ఎవరైనా మంచి పని చేస్తే చూపించుకోవాలని తాపత్రయ పడతారు. రాజకీయాల్లో అయితే.. ఏ కొంచెం మంచి చేసినా ఇంకా ఎక్కువ చూపించుకుంటారు. ఏమీ చేయకపోతేనే దాచుకునేందుకు ప్రయత్నిస్తారు. పోలవరం విషయంలో గత ప్రభుత్వం రాష్ట్రం మొత్తం బస్సులేసి ప్రజలకు పోలవరం ప్రాజెక్టును చూపించేది. ఎవరు అక్కడికి వెళ్లి చూడాలన్న ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావు. పైగా అక్కడ గైడ్ లాంటి వారిని పెట్టి మొత్తం ప్రాజెక్టు గురించి వివరించి చెప్పేవారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక మొత్తం రివర్స్ లో జరుగుతోంది. ప్రాజెక్టు వద్ద ఏం జరుగుతుందో ఎవరికీ తెలియనివ్వడం లేదు. ఎవర్నీ చూడనివ్వడం లేదు. ఎవరైనా వెళ్తారనితెలిస్తే పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించిముందస్తు అరెస్టులు చేయిస్తున్నారు. పోలవరం చూస్తే ప్రభుత్వనికి వచ్చిన నొప్పేమిటని జనానికి వస్తున్న డౌట్. పోలవరం ప్రాజెక్ట్ లాంటి అతి క్లిష్టమైన కట్టడాన్ని కొత్త ప్రాజెక్ట్ సంస్థ మేఘా నాశనం చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. శాశ్వతంగా నిలిచి ఉండాల్సిన గైడ్ బండ్ కుంగిపోవడం .. అందర్నీ విస్మయ పరుస్తోంది. ప్రాజెక్టు దగ్గరకు ఎవరైనా వెళ్తే లోపాలు తెలిసిపోతాయన్న ఉద్దేశంతో అందర్నీ ఆపుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
తాము ఏం చేస్తున్నామో చూపించడానికి గతంలో బస్సులు వేస్తే.. వైసీపీ నేతలు విమర్శించేవారు. అది పబ్లిసిటి స్టంట్ అనేవారు. ఇప్పుడు అసలు ఎవర్నీ చూడకుండా ఎందుకు దాస్తున్నారో.. .విపక్ష నేతలు వెళ్తే ఎమవుతుందో కానీ.. మొత్తానికి ప్రభత్వానికి తేడాగా వ్యవహరిస్తోంది. పోలవరం సందర్శనకు నిపుణులను అనుమతిస్తే.. అసలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.అందుకే ప్రభుత్వం వందల మందిని పెట్టి అడ్డుకుంటోందన్న అనుమానాలు కలుగుతున్నాయి.