పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు తేదీ ప్రకటించారు. అంతే వైసీపీకి.. వైసీపీ రాజ్యాంగాన్ని అమలు చేసే పోలీసులకు వణుకు ప్రారంభమయింది. వెంటనే.. వారాహి తిరిగే రూట్లలో పోలీస్ యాక్ట్ అమలు ప్రకటించేశారు. పోలీసుల తీరు చూసి జనసైనికులే కాదు.. సామాన్య ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. రాజకీయ నేతలు యాత్రలు చేసుకోడం ప్రజాస్వామ్య హక్కు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారు. ఎన్నికల ముందూ ఇదే తంతు.
అమలాపురం అల్లర్ల కారణంగా ఆరు నెలల పాటు అమలు చేసిన పోలీస్ యాక్ట్ ను రెండు నెలల కిందట ఎత్తేశారు. ఈ సారి ఏమీ జరగకుండానే పవన్ యాత్రకు వస్తున్నారని మళ్లీ రాత్రికి రాత్రి అమలు చేయడం ప్రారంభించారు. తక్షణం అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసి పవన్ యాత్ర జరిగే వరకూ అంటే.. నెలాఖరు వరకూ ఉంటుందని ప్రకటించారు. పోలీస్ యాక్ట్ ప్రకారం అనుమతి లేకుండా సభలు సమావేశాలు ఊరేగింపులు వంటివి జరగడానికి వీల్లేదు. ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెడతారు.
నెల 14 నుంచి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని కత్తిపూడి నుంచి భారీ బహిరంగ సభతో ప్రారంభమయ్యే జనసేన అధినేత పవన్కళ్యాణ్ వారాహి యాత్ర అమలాపురం, కొత్తపేట పోలీస్ సబ్ డివిజన్ ల పరిధిని దాటి చించినాడ బ్రిడ్జి ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలోకి చేరుతుంది. ఏపీ ప్రభుత్వం అకస్మాత్తుగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ తెరమీదకు తీసుకువచ్చింది. పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి యాత్రను అడ్డుకునే ప్రయత్నంలో భాగమే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ప్రయోగమని జనసేన నేతలు మండిపడుతున్నారు.
అయితే తమ ప్రజాస్వామ్య హక్కును ఇలా అడ్డుకుంటామంటే చూస్తూనే ఊరుకునేది లేదని.. తొక్కుకుంటూ వెళ్తామని జనసైనికులు అంటున్నారు. యాత్ర విషయం ఎన్ని ఆటంకాలు సృష్టించినా వెనక్కి తగ్గబోమంటున్నారు. అందుకే వారాహి యాత్రలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.