రాజకీయాల్లో రాణించాలంటే వ్యూహ ప్రతి వ్యూహాలు కాదు ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ హామీ చాలు .. ఓటర్లు ఓట్లు గుద్దేస్తారు. అలాంటి హామీగా ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీ నిలిచింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కర్ణాటక ప్రభుత్వం ‘శక్తి’ పేరుతో ఈ పథకం అమలు ప్రారంభించేసింది. ఇందు కోసం నాలుగు వేల కోట్లవరకూ ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇదే తరహా పథకాన్ని ఏపీలో టీడీపీ కూడా మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ పథకంపై చర్చ కూడా ప్రారంభమయింది.
ఇక కర్ణాటక పార్ములాను ఫాలో అవ్వాలని డిసైడయిన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికూడా తమ మేనిఫెస్టోలోఈ పథకాన్ని పెట్టడం ఖాయమే. ఈ పథకం మహిళల ఓట్లను పట్టుకుపోతుందని కంగారు పడుతున్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్… అసలు ముందుగానే అమలు చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య, ఉచిత పథకం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై పడనున్న భారం.. తదితర అంశాలపై కేసీఆర్ నివేదిక కోరారని అంటున్నారు. పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
కర్ణాటక హామీ రెండు తెలుగు రాష్ట్రాలకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలో ప్రభుత్వం మారితే అమలవుతుంది. తెలంగాణలో ప్రభుత్వం మారినా మారకపోయినా అమలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి హామీలు.. ప్రభుత్వాల్ని మార్చేస్తాయి. అందుకే రాజకీయాల్లో విజయానికి కావాల్సింది ఒక్క ట్రెండింగ్ హామీనే అంటారు.