ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై బీేజేపీ అగ్రనేతలు తమ విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. తిరుపతిలో జేపీ నడ్డా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడిన ఒక్క రోజులోనే అమిత్ షా కూడా విశాఖ వేదికగా అలాంటి విమర్శలే గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో అవినీతి, కుంభకోణాలే చేసిందని మండిపడ్డారు. విశాఖను అసాంఘిక శక్తులకు అడ్డాగా చేశారన్నారు. రైతులకు మేలు చేస్తున్నట్లుగా చెబుతున్నారని.. కానీ వారి కి చేసిందేమీ లేదన్నారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉందన్నారు. ఈ విషయంలో జగన్ సిగ్గుపడాలని అమిత్ షా ఘాటుగా వ్యాఖ్యానించారు. మైనింగ్, గంజాయి , మద్యం మాఫియాలకు ఏపీ అడ్డాగా మారిందన్నారు.
నాలుగేళ్లో కేంద్రం… ఏపీకి రూ. ఐదు లక్షల కోట్లు ఇచ్చిందని.. ఆ డబ్బులకు తగ్గట్లుగా ఏపీలో అభివృద్ధి కనిపిచిందా అని అమిత్ షా ప్రశ్నించారు. ఆ నిధులన్నీ ఏమైపోయాయని ప్రశ్నించారు. కేంద్ర పథకాలకు జగన్మోహన్ రెడ్డి తన పేరు .. బొమ్మలు పెట్టుకుంటున్నారని.. చివరికి ఉచితంగా ఇచ్చిన బియ్యానికి కూడా జగన్ తన ఫోటో పెట్టుకున్నారన్నారు. లక్షల సంఖ్యలో ఇళ్లకు కేంద్రం డబ్బులు ఇస్తే… తన పేరు పెట్టుకున్నారని అమిత్ షా మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ విజయాల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన సభ అయినప్పటికీ.. ఎక్కువగా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికే సమయం కేటాయించారు. సభలో మాట్లాడిన ఇతర నేతలు కూడా ప్రభుత్వంపై ఘాటు విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చారు. తాము ఏం చేశామో చెప్పగలుగుతామని.. మీరేం చేశారో చెప్పాలని సవాల్ చేశారు.
జేపీ నడ్డా తిరుపతిలో విమర్శలు చేయడంతో.. పేర్ని నాని, కొడాలి నానిలతో ఎప్పట్లాగే ఆయనను బూతులు తిట్టించారు. ఇప్పుడు అమిత్ షా పైనా అలాగే స్పందిస్తారేమో వేచి చూడాల్సి ఉంది.