భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు అగ్రనేతలు వరుసగా రెండు రోజులు నిర్వహించిన బహిరంగసభల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించారు. నిజానికి వారు పెట్టుకున్న సభలు నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల పాలనా విజయాలను ప్రచారం చేయడానికే. అయితే ఏపీలో మళ్లీ సభలు ఎప్పుడు పెడతారో తెలియదు కానీ.. తమ స్టాండ్ ఏమిటో తెలియచేయాలనుకున్నారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. మొదటి రోజు జేపీ నడ్డా చేసిన విమర్శలు ఘాటుగా ఉంటే.. రెండో రోజు అమిత్ షా కూడా అవే రిపీట్ చేశారు. దీంతో వైసీపీ విషయంలో బీజేపీ కి క్లారిటీ ఉందన్న అభిప్రాయం గట్టిగా వినిపించడం ప్రారంభమయింది.
వైసీపీ అవినీతి, ప్రజాకంటక పాలనపై బీజేపీ పెద్దలకు స్పష్టత
ఏపీలో ఏం జరుగుతుందో బీజేపీ నేతలకు ఓ స్పష్టత ఉందని జేపీ నడ్డా, అమిత్ షాలు చేసిన ప్రసంగాలతో స్పష్టమయింది. ప్రజలు ఇచ్చిన అధికారం కారణంగా జగన్ సీఎంగా ఉన్నారు కాబట్టి .. తమ జోలికి రాలేదు కాబట్టి వివాదాస్పదమైన అంశాల్లో బీజేపీ ఇప్పటి వరకూ తలదూర్చలేదని అనుకోవచ్చు. కారణం ఏమైనప్పటికీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వంపై వారు ఏ మాత్రం సానుభూతి చూపించే పరిస్థితుల్లో లేరని మాటలను బట్టి అర్థమవుతుంది. అయితే ఏపీ ప్రజల్లో చాలా మందికి వచ్చే డౌట్. మాటలు ఓకే…. మరి చేతల సంగతేమిటనే?
జగన్ ప్రభుత్వానికి అడ్డగోలు సహకారం ఆపుతారా ?
జగన్ ప్రభుత్వానికి కేంద్రం ఎప్పటికప్పుడు అండగా ఉంటుందన్నది వంద శాతం నిజం. డబ్బులు అవసరమైనప్పుడల్లా అప్పులో.. నిధులో విడుదల చేస్తున్నారు. ఆ డబ్బుల్ని దుర్వినియోగం చేస్తున్నారని స్పష్టత ఉన్నా పట్టించుకోవడం లేదు. ఏపీలో శాంతిభద్రతలు అత్యంత దారుణంగా ఉన్నాయని.. రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని సాక్షాత్తూ కోర్టులు చెప్పినా కేంద్రం పట్టించుకోలేదు. అంతే కాదు.. ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా తీసుకున్న కొన్ని వందంల నిర్ణయాలను కోర్టులు కొట్టేసినా ఇంత దరిద్రపు.. పాలన చేస్తున్నారేమిటని కేంద్రం నుంచి ఒక్క హెచ్చరిక కూడా రాలేదు. అమరావతిని అడ్డగోలుగా నిర్వీర్యం చేసినా పట్టించుకోలేదు.
చాయిస్ బీజేపీదే !
వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో బీజేపీ పెద్దలు గ్రహిస్తారో లేదో తెలియదు కానీ.. పైకి అయితే మాత్రం వారు కూడా మెచ్చడం లేదు. గతంలో ఎప్పుడూ చేయనన్ని విమర్శలు చేశారు. ఇది చాలా వరకూ.. ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న వారికి సంతృప్తినిస్తోంది. కానీ మాటల్లో కాదు.. చేతల్లోనూ వైసీపీ ప్రభుత్వంపై తమ వ్యతిరేకత చూపాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. చాయిస్ బీజేపీ చేతుల్లోనే ఉంది.