‘కార్తికేయ 2’కి ముందు నిఖిల్ వేరు.. ఇప్పటి నిఖిల్ వేరు. కార్తికేయ 2 పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో నిఖిల్ రేంజ్ పెరిగింది. ఇప్పుడు నిఖిల్ లైనప్ మామూలుగా లేదు. అన్నీ క్రేజీ ప్రాజెక్టులే. అందులో ‘స్పై’ ఒకటి. విడుదలకు ముందే ఈ సినిమా రూ.20 కోట్ల టేబుల్ ప్రాఫిట్ చూసిందంటే.. నిఖిల్ రేంజ్ అర్థం చేసుకోవొచ్చు. అయితే ఈ సినిమా విషయంలో నిర్మాతకీ, హీరోకీ చిన్న గలాటా నడుస్తోంది.
ఈ నెలాఖరున ‘స్పై’ రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. డేట్ కూడా బయటకు వచ్చేసింది. అయితే.. సినిమా ఇంకా పూర్తి కాలేదు. సీజీ వర్క్‌పై నిఖిల్ కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు టాక్. మంచి క్వాలిటీతో సినిమాని విడుదల చేయాలంటే కాస్త టైమ్ తీసుకోవాలి. అందుకే రిలీజ్ డేట్ ని వాయిదా వేయాలని నిర్మాతని అడిగాడట. అయితే ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్ తో ఉన్న నిర్మాత.. సినిమాపై పైసా ఖర్చు పెట్టడానికి కూడా రెడీగా లేడని టాక్. ఎలాగూ సినిమా అమ్మేశాం కదా, ఇలానే రిలీజ్ చేసేద్దాం అనుకొంటున్నాడట. కానీ నిఖిల్ మాత్రం క్వాలిటీ సినిమా ఇవ్వకపోతే, ఫలితం తేడా వస్తుందని భయపడుతున్నాడు. అన్నింటికి మించి ప్రమోషన్లకు సమయం లేదు. మరో 20 రోజుల్లో పాటలు, ట్రైలర్ విడుదల చేసి, ప్రమోషన్లు చేసుకోవడం కుదరదు. రూ.20 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చినప్పుడు అందులోంచి తిరిగి కొంత ఖర్చు పెట్టడం తప్పులేదన్నది నిఖిల్ వాదన. కార్తికేయ 2 తరవాత నిఖిల్ సినిమాపై అంచనాలు పెరగడం సహజం. నిఖిల్ కూడా తన ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంలో ఎలాంటి తప్పూ లేదు. అందుకే తను కాస్త కఠినంగానే ఉంటున్నాడు. ఈ విషయమై నిర్మాతకీ, నిఖిల్‌కీ క్లాష్ వచ్చింది. ఇప్పటికి డబ్బింగ్ వర్క్ కూడా పూర్తి కాలేదు. నిఖిల్ డబ్బింగ్ చెప్పనే లేదు. నిఖిల్ డబ్బింగ్ చెప్పకపోతే సినిమా ఎలా బయటకు వస్తుంది. అందుకే సీజీ వర్క్‌లు పూర్తయ్యేంత వరకూ డబ్బింగ్ చెప్పకూడదని నిఖిల్ భావిస్తున్నాడట. నిఖిల్ తో ఎలాగైనా డబ్బింగ్ చెప్పించి, అనుకొన్న సమయానికి సినిమా విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.